ఇచ్ఛాఫురం: మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురం గ్రామానికి చెందిన గర్భిణీకి 108 సిబ్బంది ప్రసవం చేసి ఆదుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పురుషోత్తపురం గ్రామానికి చెందిన మామిడి నాగమ్మకి బుధవారం సాయంత్రం పురుటినొప్పులు ఎక్కువవ్వడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది ఇంటికి చేరుకునేటప్పటికే నొప్పులు చాలా ఎక్కువ కావడం, బయట తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో గర్భిణీకి ఇంటివద్దనే పురుడుపోశారు. దీంతో ఆమె కవల పిల్లలు బాబు, పాపకు జన్మనిచ్చింది. అనంతరం స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం అదే వాహనంలో బరంపురం తరలించారు. ఇందులో 108 సిబ్బంది ఉప్పర్ బాలకృష్ణ, వసంత గోవిందరావు ఉన్నారు.


