అరసవల్లి: అర్నబ్ తుఫాన్ ప్రభావం విద్యుత్ శాఖపై తీవ్ర ప్రభావం చూపించింది. మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఈదురు గాలుల ధాటికి శ్రీకాకుళం, పలాస, టెక్కలి డివిజన్ల పరిధిలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల భారీ చెట్లు కూలిపోవడంతో స్తంభాలు విరిగిపోయాయి. టెక్కలి, పలాస డివిజన్లలో ఎక్కువగా నష్టం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి 33 కేవీ ఫీడర్లు సుమారు 70 వరకు, 11 కేవీ ఫీడర్లు 90 వరకు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు 120కి పైగానే నేలకూలాయి. ట్రాన్స్ఫార్మర్లు 25 వరకు దెబ్బతిన్నాయి. నష్టం విలువ సుమారు రూ. 35.60 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు అంచనా నివేదికలు సిద్ధం చేశారు. సీఎండీ పృథ్వీతేజ ఆధ్వర్యంలో స్థానిక సర్కిల్ ఎస్ఈ జీఎన్ ప్రసాద్, ఆపరేషన్స్ ఈఈల ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తున్నారు.


