శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో తీరని నష్టం మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అనేక చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలు నీటమునిగాయి. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతం చిగురుటాకులా వణికింది. వందలాది కొబ్బరిచెట్లు నేలకొరగడంతో భారీగా నష్టం వాటిల్లింది. సుమారుగా 3,212.41 హెక్టార్లలో వరి, ఇతర పంటకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. 3206.41 హెక్టార్లతో వరి, 3 హెక్టార్లలో పెసర, 2 హెక్టార్లలో మినుము, ఒక హెక్టారులో పత్తి నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. 174 గ్రామాల పరిధిలో సుమారు 6930 మంది రైతులు నష్టాలకు గురయ్యారు. జిల్లాలో 39 ఇల్లు దెబ్బతిన్నాయి. అందులో నాలుగు పక్కా ఇళ్లు పాక్షికంగా, రెండు కచ్చా ఇల్లు పూర్తిగా, 30 కచ్చా ఇల్లు పాక్షికంగా, మూడు గుడిసెలు నేలకొరిగాయి. ఎచ్చెర్ల మండలం కుప్పిలి గెడ్డ కాలువ ఉప్పొంగడంతో గ్రామ పరిసర ప్రాంతాలు, రహదారులపైకి భారీగా వరదనీరు చేరింది. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించి సహాయక చర్యలపై ఆరా తీశారు. బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో 809 మి.మీ. వర్షం కురిసింది. సగటున 27.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.
శ్రీకాకుళం: రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో పలు వార్డుల్లోకి వర్షం నీరు వచ్చేసింది. కిటికీలకు అద్దాలు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఏఆర్టీ కేంద్రంలో ఎక్కువగా నీరు రావడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షాలు, ఈదురుగాలులతో
భారీ నష్టం
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
నీటమునిగిన పంటలు, దెబ్బతిన్న ఇళ్లు
నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు


