● ఫోర్జరీ సంతకాలతో విత్‌డ్రా చేసిన ఆర్‌ఓపై చర్యలు తీసుకోవాలి
● విలేకరులతో ఆమదాలవలస వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్‌ల విత్‌డ్రా ప్రక్రియను అధికారులు, పాలకులు ఓ నాటకంలా మార్చేశారని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రజాక్షేత్రంలో గెలిచే దమ్ములేక ఫోర్జరీ సంతకాలు చేయించి రిటర్నింగ్ అధికారితో తప్పుడు ప్రచారం చేయించి విత్‌డ్రా అయినట్లు చెప్పించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, కూన రవికుమార్‌లు కలిసి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచిన ఈ నెల 27వ తేదీని చీకటి రోజుగా భావిస్తున్నామన్నారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బాధిత ఎంపీటీసీ మహిళలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొందూరు మండలం బాణాంలో పప్పల రాజ్యలక్ష్మి, పొందూరు–3లో కాలెపు శ్రీదేవి, రాపాక–1లో ఎచ్చెర్ల పద్మావతి(ఎస్సీ), కోటిపల్లిలో కూన శోభారాణి, నందివాడలో లింగాల అరుణకుమారి(ఎస్సీ) తామెక్కడా సంతకాలు చేయలేదని, విత్‌డ్రా అవ్వలేదని చెప్పినా, ఆధారాలు చూపించాలని ప్రశ్నించినా ఆర్‌ఓ సమాధానం చెప్పలేకపోయారన్నారు. స్వాతంత్య్రానంతరం ఉత్తరాంధ్రలో గానీ, శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి సంస్కృతి ఉందా? అని ప్రశ్నించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే కూన రవికుమార్ పాతాళానికి పోవడం ఖాయమన్నారు. కూన రవికుమార్‌కు ఆర్‌ఓ దాసోహం కావడం సరికాదన్నారు. అసలు ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని రిటర్నింగ్ అధికారిగా ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఆర్‌ఓ ఆఫీసులో సీసీ కెమెరాలు పెట్టాలని ఈసీ చెప్పినా పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏంటన్నారు. రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని, హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తున్నామని ప్రకటించారు. 55 ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్లు అడ్డుకోవాలని చూసినా విజయవంతంగా వేయగలిగామన్నారు. రిటర్నింగ్ అధికారిపై అట్రాసిటీ కేసు కూడా పెడతామన్నారు. దళిత మహిళా ఎంపీటీసీ అభ్యర్థులకు అన్యాయం చేయడం పట్ల దళిత సంఘ నాయకులంతా స్పందించి అండగా నిలవాలని కోరారు.
బాధిత ఎంపీటీసీ అభ్యర్థులు మాట్లాడుతూ తామంతా నామినేషన్ వేసి ప్రచారం చేసుకున్నామే తప్ప మళ్లీ ఎంపీడీఓ కార్యాలయం వైపు వెళ్లలేదని స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు కోర్టుల్లో పోరాడతామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సువ్వారి గాంధీ, లోలుగు కాంతారావు, గంట్యాడ రమేష్, బాధిత ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు.


