ఫోర్జరీ విత్‌ డ్రామాపై పోలీసులకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ విత్‌ డ్రామాపై పోలీసులకు ఫిర్యాదు

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

● ఎన్నికల బరిలో లేకుండా అభ్యర్థులకు తెలియకుండా విత్‌డ్రాలు

● పొందూరు మండలంలో టీడీపీకి లబ్ధి చేకూర్చేలా ఐదు ఎంపీటీసీలు ఏకగ్రీవం

● తమకు తెలియకుండా విత్‌డ్రాలేంటని ప్రశ్నించిన అభ్యర్థులు

● తెల్లమొహం వేసిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి

● సీసీ పుటేజీలు అడిగితే సీసీ కెమెరాలు లేవంటూ సమాధానం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ః

మంగళవారం ఉదయం 11.30 గంటలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరి బీ–ఫారాలను రిటర్నింగ్‌ అధికారి తీసుకున్నారు. ఎకనాలెడ్జ్‌మెంటూ ఇచ్చారు. నామినేషన్‌ వేసిన అభ్యర్థులు మళ్లీ ఎంపీడీవో కార్యాలయానికి కనీసం రాలేదు. వారంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఏ సమయంలో కూడా విత్‌డ్రా చేసుకోలేదు. కానీ, రాత్రి 8 గంటలకు ఐదు ఎంటీపీసీ స్థానాలను విత్‌ డ్రా చేసుకున్నారని, టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్టు ప్రకటించడం వెనక కుట్ర దాగిందని స్పష్టంగా తేటతెల్లమవుతోంది. జిల్లా చరిత్రలో ఇటువంటి ఘటనలు ఎప్పుడూ చోటుచేసుకోలేదు. కూన రవికుమార్‌ సొంత మండలంలో ఇప్పుడు జరగడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలే తప్ప దొంగదెబ్బ తీసి ఏకగ్రీవాలు చేసుకోవడం ఏంటని ప్రజలు తప్పు పడుతున్నారు.

సరికొత్త ఫేక్‌ నాటకాలు..

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ తరఫున టీడీపీ వర్గీయులు ఫేక్‌ నామినేషన్ల ఘటనలు చూశాం. టీడీపీ వర్గీయులు బెదిరించి, బలవంతంగా అభ్యర్థుల చేత విత్‌డ్రాలు చేయించడం చూశాం. కానీ, అభ్యర్థులకు తెలియకుండా, వారి సంతకాల్లేకుండా, సంతకాలు ఫోర్జరీ చేసి, ఫేక్‌ విత్‌డ్రాలు పెట్టి, టీడీపీ అభ్యర్థులను ఏకగ్రీవం చేశారంటే బరి తెగించినట్టే అవుతోంది. రిటర్నింగ్‌ అధికారి ఏ స్థాయిలో టీడీపీతో కుమ్మక్కయ్యారో అర్థం చేసుకోవచ్చు.

ఓటమి భయంతోనే..

ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఎమ్మె ల్యే కూన రవికుమార్‌ సొంత మండలమైన పొందూరులో ప్రాబల్యం కోల్పోతామేమోనని గుబులు రేగుతోంది. దీంతో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఫేక్‌ నాటకాలకు దిగారు.

సీసీ కెమెరాల్లేవట..

సీసీ ఫుటేజీలు చూపించండంటే సీసీ కెమెరాలే లేవని చెప్పడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే సీసీ కెమెరాలు తప్పనిసరి అని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇక్కడ అందుకు విరుద్ధంగా నడిచింది. దీన్ని బట్టి ఇక్కడ ఇంకెన్ని తప్పిదాలు, అక్రమాలు జరిగాయో నామినేషన్లు వేసిన వారికే తెలియాలి.

ఎంపీటీసీల నామినేషన్ల పత్రాలపై ఫోర్జరీ సంతకాలు చేయించి విత్‌డ్రా అయినట్లు ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సూర్యప్రకాశరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాణాం, కోటిపల్లి, నందివాడ, రాపాక–1, పొందూరు–3 వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు పప్పల రాజ్యలక్ష్మి, కూన శోభారాణి, లింగాల అరుణకుమారి, ఎచ్చెర్ల పద్మావతి, కాలెపు శ్రీదేవి బుధవారం పొందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. –జి.సిగడాం(పొందూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement