ఇచ్ఛాపురం : ఎగువన ఒడిశా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బగలట్టి డ్యామ్ నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతమైన ఇచ్ఛాపురం పరిధిలో బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. బుధవారం రాత్రి 8 గంటల సమయానికి బాహుదా నది వరద ప్రవాహం 58,436 క్యూసెక్కులకు చేరుకుంది. నదీ ప్రవాహం తీవ్రస్థాయికి చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పేటూరు, లొద్దపుట్టి, ఇన్నేసుపేట, బిల్లింగి తోటూరు గ్రామాలు ముంపునకు గురికావడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.


