కంచిలి మండలంలోని అంపురం నుంచి ఘాటి ముకుందాపురం వరకు ఉండే ఆర్అండ్బీ రోడ్డు మార్గంలో జె.బెల్లుపడ నుంచి నారాయణబట్టి గ్రామాల మధ్య ఉన్న రోడ్డులో కల్వర్టు శిథిలావస్థకు చేరింది. ఇక్కడ కల్వర్టుకు రెండువైపులా పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి. ఈ ప్రదేశం వద్ద ఒకేసారి ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే తప్పించుకునేందుకు వీలుపడని పరిస్థితి ఉంది. రాత్రిపూట ఈ పరిస్థితి ఎదురైనప్పుడు అక్కడ రంధ్రాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనచోదకులు వాపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఇంతటి భయానక పరిస్థితి ఏర్పడినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొత్త కల్వర్టు నిర్మాణానికి అత్యవసర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
– కంచిలి


