శ్రీకాకుళం క్రైమ్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా పోలీసులు లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. మంగళవారం పోలీసు టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడుతూ నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయ నదీ పరివాహక ప్రాంతాలతో పాటు వరద ముప్పు ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ, విద్యుత్, విపత్తు నిర్వహణ, వైద్య తదితర శాఖలతో పోలీసులు సమన్వయం పాటించాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచి అసరమైన రక్షణ సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. డయల్ 112, 6309990933 పోలీస్ కంట్రోల్ రూమ్‌నకు అత్యవసర సమాచారంపై తక్షణమే స్పందించాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కోరారు.


