● గుర్రపుడెక్క ఊబిలో చిక్కుకున్న వ్యక్తి
● రక్షించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
కాశీబుగ్గ : పలాస మండలం గరుడఖండి సవరగెడ్డలో ఓ వ్యక్తి పొరపాటున గుర్రపుడెక్కలో దిగి ఊబిలో చిక్కుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సవరగెడ్డలో పూర్తిగా గుర్రపుడెక్క పేరుకుపోవడంతో అక్కడ నీరు ఉందన్న ఆనవాళ్లే కనిపించని పరిస్థితి. అయితే ఆ గెడ్డలో శుక్రవారం ఓ వ్యక్తి ఎందుకు దిగాడో తెలియదు కానీ ఊబిలోంచి బయటకు రాలేకపోయాడు. గెడ్డలోంచి కేకలు వేయడంతో స్థానికులు గమనించారు. లోపల సుమారు 55 ఏళ్ల వ్యక్తి ఉన్నాడని గ్రహించి వెంటనే కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో అతికష్టమ్మీద బయటకు తీసుకువచ్చారు. అప్పటికే అపస్మారకస్థితికి చేరుకోవడంతో పలాస సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.


