టీడీపీ కుట్రల వల్లే కార్పొరేషన్‌ ఎన్నికలకు ఆటంకం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కుట్రల వల్లే కార్పొరేషన్‌ ఎన్నికలకు ఆటంకం

Sep 19 2026 8:56 AM | Updated on Sep 19 2026 8:56 AM

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): శ్రీకాకుళం కార్పొరేషన్‌ ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతలే అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వి స్వరూప్‌ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మున్సిపల్‌ ఎన్నికలకు సన్నాహలు చేసినప్పుడు ఏడు పంచాయతీలు విలీనమైతే ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులు ఆగిపోతాయని, దాంతో అభివృద్ధి జరగదనే నెపంతో టీడీపీ నేతలే కోర్టులో కేసులు వేసి ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థినే మేయర్‌గా భారీ మెజార్టీతో గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం (టౌన్‌హాల్‌)లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా స్వరూప్‌ మాట్లాడుతూ నిన్నగాక మొన్న గెలిచిన ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును విమర్శిస్తూ శ్రీకాకుళానికి ఏం చేశారని అనడం దారుణమన్నారు. రిమ్స్‌ మెడికల్‌ కాలేజ్‌, మూడు వంతెనలు, అంబేడ్కర్‌ యూనివర్సిటీ, కళింగరోడ్డు విస్తరణ, 80 అడుగుల రోడ్డు, రైతుబజారు రోడ్డు విస్తరణ, 24గంటల తాగునీరు అందించిన వ్యక్తి ధర్మానే అని గర్వంగా చెప్పగలమన్నారు. రోడ్డుమీద రోడ్డులు వేయడం, వాణిజ్య ప్రకటనల బోర్డులో టీడీపీ కార్యక్రమాలు చెప్పుకోవడమే తప్ప అంతకుమించి చేసింది లేదన్నారు. రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగితే ధర్మాన ప్రసాదరావు సూచనల మేరకు ఆయన నిర్ణయించే వ్యక్తిని గెలిపించి తీరుతామన్నారు.

వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, రఫీ, అంధవరపు రామారావులు మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. డే నైట్‌ జంక్షన్‌ వరకు జరుగుతున్న రోడ్డు విస్తీర్ణ పనుల్లో నిబంధనలు పాటించలేదన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో డబ్బులు ఎదజల్లడం వల్లనే టీడీపీ గెలించిందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, మైనార్టీసెల్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంఏ బేగ్‌, గ్రీవెన్స్‌సెల్‌ అధ్యక్షుడు రౌతు శంకరరావు, బీసీ విభాగం నగర అధ్యక్షుడు గద్దిబోయిన కృష్ణయాదవ్‌, మండవిల్లి రవి, భైరి మురళి, దుంగ సుధాకర్‌, సీపాన మహేంద్ర, చంగళరావు, తేజ, భాను, తంగి అప్పన్నస్వామి, సుధ తదితరులు పాల్గొన్నారు.

ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తాం

మున్సిపాల్టీని అవినీతికి అడ్డాగా మార్చేశారు

తెలుగుదేశం నేతలపై వైఎస్సార్‌సీపీ నాయకుల మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement