నేడు పలు ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు | - | Sakshi
Sakshi News home page

నేడు పలు ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు

Sep 19 2026 8:56 AM | Updated on Sep 19 2026 8:56 AM

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి శనివారం పలు ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దయ్యాయి. విశాఖపట్నంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో అక్కడికి ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను విశాఖ పంపించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులు తగ్గనున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు మాత్రం యధావిధిగా నడవనున్నాయి. శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 25 బస్సులు, శ్రీకాకుళం రెండో డిపో నుంచి 20, టెక్కలి డిపో నుంచి 10 కలిపి మొత్తం 50 బస్సులు విశాఖకు వెళ్లనున్నాయి. దీంతో జిల్లా కేంద్రంతో పాటు టెక్కలి డిపో పరిధిలో కూడా కొన్ని రూట్లలో బస్సులు తగ్గనున్నాయి. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్‌.అప్పలనారాయణ కోరారు.

పశుసంవర్థక సహాయకులను రెగ్యులర్‌ చేయాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రభుత్వ నోటిఫికేషన్‌ ద్వారా 2023లో నిబంధనల మేరకు మెరిట్‌, ఇతర అర్హతల ఆధారంగా ఎంపికై నియమితులైన పశుసంవర్థక సహాయకులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ సదరు ఉద్యోగులు శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. జిల్లావ్యాప్తంగా 30 మంది ఉన్నామని, రెండేళ్ల ప్రొబేషన్‌ కాలాన్ని ఫిబ్రవరి 2026లో పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు సర్వీస్‌ రెగ్యులరైజేషన్‌ ఉత్తర్వులు జారీ కాలేదని జిల్లా పశుసంవర్ధక సహాయకుల సంఘం అధ్యక్షుడు టి.అయ్యప్ప, కార్యవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకు రూ.15,000, కన్సాలిడేటెడ్‌ వేతనంతో పనిచేస్తున్నారని, చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని తెలిపారు. పాలకులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

కరువు ప్యాకేజీ ప్రకటించాలి

రణస్థలం : రైతు, కౌలు రైతు, వ్యవసాయ కూలీలకు కరువు ప్యాకేజీ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం సహాయ కార్యదర్శి బి.రాంబాబు, కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమల రమణ డిమాండ్‌ చేశారు. రణస్థలంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో 655 మండలాల్లో వర్షాభావం నెలకొందన్నారు. చాలా వరకు ఖరీఫ్‌ పంటలు వేయలేదని, వేసిన చోట కూడా పంటలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే కరెంట్‌ కోతలు విధిస్తున్నారని, గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ఈ ఏడాది కరువు ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. కరవు సహాయ నిధి కింద ఎకరాకు రూ. 25వేలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘ నాయకులు పిషిణి సత్యం, ఏ.అప్పారావు, ఆర్‌.సత్యనారాయణరావు, శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ స్తంభం విరిగిపడి కాంట్రాక్ట్‌ ఉద్యోగి మృతి

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా కేంద్రంలోని సీపన్నాయుడుపేట విజయాదిత్యా పార్కు సమీప పొలాల్లో విద్యుత్‌ స్తంభం విరిగిపడిన ఘటనలో కాంట్రాక్ట్‌ వర్కర్‌ మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్‌ మండలం సింగుపురానికి చెందిన సాధు కామేష్‌ (42) కొంతకాలంగా కాంట్రాక్టు ఉద్యోగిగా విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మీ, డిగ్రీ చదువుతున్న కుమారు పవన్‌ ఉన్నారు. శుక్రవారం విధుల్లో భాగంగా విజయాదిత్యాపార్కు ఎదురుగా ఉన్న పొలాలలో విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. ఓవైపు పూర్తిగా ఒరిగి ఉన్న స్తంభం కావడంతో అకస్మాత్తుగా విరిగిపోయి పొలంలో పడిపోయి. అతనిపైనే స్తంభం ఉండిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement