శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు ఈ నెల 20న జరగనున్నాయని జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు గురువారం పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని ఇప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ సెలక్షన్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. బాలబాలికలు 2009 జనవరి ఒకటి తర్వాత జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను అక్టోబర్ 13 నుంచి 15వ తేదీ వరకు వైఎస్సార్ కడప జిల్లా వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2026 పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు జనన ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఇప్పిలి జెడ్పీహెచ్ స్కూల్ వద్దకు చేరుకోవాలని, పూర్తి వివరాలకు పీడీ మెట్ట తిరుపతిరావు (94404 36317)ను సంప్రదించాలని కోరారు.
రేపు ఛాయారాజ్ వర్ధంతి సభ
శ్రీకాకుళం: ప్రజాసాహిత్య, సాంస్కృతికోద్యమ నేత, భావాల సరిహద్దుల వద్ద కాపలా కాసిన నూతన ప్రజాస్వామిక కవి కామ్రేడ్ ఛాయారాజ్ 13వ వర్ధంతి సభ ఈ నెల 20న శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నట్లు జనసాహితి జిల్లా అధ్యక్షుడు టి.శోభన్ బాబు, ఉపాధ్యక్షుడు కె.పాపారావు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజంతా సదస్సు, కవి సమ్మేళనం జరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయంతం చేయాలని కోరారు.
ఆకట్టుకున్న నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్ : సుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో అఖిల భారత బహుభాషా నాటిక పోటీలు రెండో రోజు శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో ఉత్సాహంగా సాగాయి. ముంబైకు చెందిన బియింగ్ కళాకార్ రచన, యువరాజ్ వివేక్తమహంకర్ దర్శకత్వంలో ‘సూప్’ అనే మరాఠీ నాటిక ప్రదర్శించారు. అనంతరం వీకేఎం కళావిదురు, బెంగళూరుకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ కంబార్ రచనలో, సీఎం తిమ్మయ్య దర్శకత్వంలో ‘సాంగ్వా –బాల్య’ కన్నడ నాటిక ఆద్యంతం అలరించింది. అనంతరం కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఇప్పిలి శంకరశర్మ, కె.సోమేశ్వరరావు, విశ్రాంత రిజిస్ట్రార్ గుంట తులసిరావు, ప్రిన్సిపాల్ నంద సూర్యనారాయణ స్వామి, ఎల్.నందికేశ్వరరావు, కొంక్యాన మురళి, గుత్తు చిన్నారావు, మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, కె.సురేష్, పూజ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. శనివారం ‘పేసెస్ ఆఫ్ ఉమెన్’ ఒడియా నాటిక, ‘యకీనన్‘ ఛత్తీస్‌గఢ్ నాటికలు ప్రదర్శిస్తారు.


