కవిటి : ప్రశాంతంగా జరగాల్సిన అంత్యక్రియలకూ ప్రహసనం తప్పడం లేదు. కవిటి మండల కేంద్రంలో శ్మశానవాటికకు వెళ్లేందుకు సరైన మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కవిటి, గొండ్యాలపుట్టుగ, ప్రగడపుట్టుగ, రామయ్యపుట్టుగలలోని సుమారు ఐదు వేల మంది ప్రజలకు ఒకే శ్మశానవాటిక ఆధారం. సుమారు ఏడాదిన్నర కాలం నుంచి ఈ శ్మశానానికి వెళ్లేందుకు అనువైన మార్గం లేక అంత్యక్రియలకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కవిటి శ్మశాన వాటికకు వెళ్లేందుకు వేస్తున్న రోడ్డు నిర్మాణం పనులు పూర్తి కాకపోవడమే దీనికి కారణం.
శ్మశానవాటికకు వెళ్లే దారేదీ?
శుక్రవారం గొండ్యాలపుట్టుగలో ఓ వ్యక్తి మృతిచెందారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రోడ్డు నిర్మా ణం పూర్తికాకపోవడంతో గ్రామస్తులు మరోమార్గంలో వెళ్లాలని ప్రయత్నించారు. ఆ దారిలో గణేష్ మండపం ఉంది. ఇటువైపుగా రావడానికి వీల్లేదని నిర్వాహకులు అడ్డుతగిలారు. దీంతో నడిరోడ్డుపైనే మృతదేహాన్ని పట్టుకుని గంటలతరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. స్థానికంగా ఉంటున్న వారు ప్రత్యామ్నాయ మార్గంలో శవాన్ని తీసుకువెళ్లేందుకు ఒప్పుకోలేదు. ప్రశాంతంగా జరగాల్సిన అంత్యక్రియల ప్రక్రియ గొడవలకు దిగాల్సిన పరిస్థితులు దాపురించడం సిగ్గుచేటని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పనులు సకాలంలో పూర్తికావాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి నెలకొందని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా కవిటి పంచాయతీకే చెందిన ప్రభుత్వ విప్, మూడుసార్లు గెలిచిన జిల్లాలోనే సీనియర్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కనీసం పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కూటమి ప్రభుత్వం హయాంలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ప్రహసనంగా మారింది. అందుకే పనులు సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు అధికారులు ఆదేశించడానికి ధైర్యం చాలడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సుమారు ఐదు గ్రామాల ప్రజలకు తీవ్ర సమస్యగా మారిన కవిటి శ్మశానవాటికకు మండల కో ఆప్షన్ సభ్యుడిగా గతంలో రూ.3లక్షల నిధులతో పనులకు ప్రతిపాదించాను. దాన్ని జరక్కుండా అడ్డుకున్నారు. సర్పంచ్‌గా ఉన్న కాలంలో సర్వేచేయించి శ్మశానవాటిక పరిరక్షణ అభివృద్ధికి నా వంతు చర్యలు చేపట్టాను. ఇవన్నీ పక్కన పెడితే సమస్య తీవ్రతను ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి వెంటనే పరిష్కరించాలి.
– పాండవ శేఖర్,
మండల కో–ఆప్షన్ సభ్యుడు, కవిటి
కవిటి శ్మశానవాటికకు సంబంధించి రోడ్డు పనులు అసంపూర్ణంగా నిలిచిపోయిన మాట వాస్తవమే. మరికొంతమేర నిధులు జోడించి పనులు ఆగిపోయిన దశ నుంచి పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపడతాం.
– ఎల్.త్రినాథ, కవిటి పంచాయతీ ప్రత్యేకాధికారి
కవిటిలో శ్మశానవాటికకు వెళ్లేందుకు మార్గం కరువు
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఈ దుస్థితి
కనీసం స్పందించని ఎమ్మెల్యే, అధికారులు


