● లోకేష్, కూన రవికుమార్, భరత్‌లకు జైలుశిక్ష తప్పదు ● వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి ధ్వజం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలో డీఎస్సీ–2025 నియామకాల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందన్న విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం టౌన్‌హాల్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, ఇందులో కీలకపాత్ర పోషించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి రాత పరీక్షలేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చేందుకు జీవో నంబర్ 47కి తెరలేపారని, దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించడంతో జీవోని రద్దుచేసి కొత్త జీవో తీసుకురావడం దారుణమన్నారు. టెట్ లేకుండానే ఉద్యోగాలు ఇవ్వడం సరికాదన్నారు. క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి కాకుండా ఫేక్ అసోసియేషన్ సర్టిఫికేటుగాళ్లకు ఉద్యోగాలిచ్చారని దుయ్యబట్టారు. లోకేష్, కూన రవికుమార్‌లు అసోషియేషన్ నుంచి రూ.15లక్షలు చొప్పున తీసుకుని రద్దయిన సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ నుంచి 37 మందికి ఉద్యోగాలిచ్చి, కష్టపడి చదివినవారికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. వాస్తవానికి శాప్, సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ కార్యదర్శి సంతకం చేసి ఇచ్చే సర్టిఫికెట్లు మాత్రమే సరైనవని, అధ్యక్షుడికి ఎటువంటి అర్హత లేదని స్పష్టం చేశారు. అసలు డీఎస్సీ నియామకం జరిగిన 2025 నాటికి సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ 2024 డిసెంబర్‌తో ముగిసిందని, మళ్లీ 2026 జూలైలో రికర్గనైజేషన్ చేశారని చెప్పారు. కూన రవికుమార్ అపరమేధావి అని, శ్రీకాకుళం జిల్లాలో కాని, ఆయన నియోజకవర్గంలో ఒక్కరికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వలేదని, డబ్బులు తీసుకుని ఇస్తే జిల్లా ప్రజల దగ్గర చెడ్డ పేరు వస్తుందనే ఇవ్వలేదని విమర్శించారు.
బహిరంగ చర్చకు సిద్దమా...!
డీఎస్సీ అక్రమాల్లో ప్రధాన సూత్రదారి కూన రవికుమార్ తనతో బహిరంగ చర్చకు రావాలన్నారు. కూనకు జగన్‌మోహన్‌రెడ్డికి సవాలు విసిరే స్థాయి లేదన్నారు. రానున్న మూడేళ్లలో ఏ నియామకాల్లోనైనా ఏ ఉద్యోగానికై నా స్పోర్ట్స్ కోటా కింద పరీక్ష లేకుండా ఉద్యోగాలిచ్చేందుకే జీవో 47ను తీసుకొచ్చారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లు పెట్టాకే దాన్ని మార్చేసి జీఓ నెం.56ని తీసుకొచ్చి హారిజెంటల్ విధానం ద్వారా ఉద్యోగాలు అమ్మేందుకు రంగం సిద్ధం చేశారని ధ్వజమెత్తారు. నారా లోకేష్, భరత్, కూన రవికుమార్‌లకు జైలు శిక్ష ఖాయమన్నారు. ఇసుక, గ్రావెల్, మట్టి, బ్లాక్‌స్టోన్‌లను అక్రమంగా అమ్ముకుని అవినీతి చేసి బతుకడమే కూన రవికుమార్‌కు తెలిసిన నాయకత్వమని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, వైఎస్సార్‌సీసీ టీఎఫ్ నాయకులు జల్లు బలరాంనాయుడు తదితరులు పాల్గొన్నారు.


