నరసన్నపేట: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న రియాజ్ పాషాను నరసన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ. 30 వేల విలువైన 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న బెంగళూరులోని జయనగర్‌కు చెందిన రియాజ్ పాషాకు ఒడిశాకు చెందిన హిమాన్స్ ఫికర్‌తో పరిచయం ఏర్పడింది. ఆటో నడుపుతూ ఎంత డబ్బు సంపాదిస్తావు.. గంజాయి అమ్మకం ద్వారా ఒకేసారి అధిక మొత్తంలో సంపాదించవచ్చని ఆశచూపి గంజాయి అక్రమ వ్యాపారానికి ఒప్పించాడు. ఈ క్రమంలో పలుమార్లు గంజాయిని బెంగళూరు తీసుకువెళ్లి విక్రయాలు సాగించాడు. దీనిలో భాగంగా బరంపురం ప్రాంతానికి చెందిన బికారి ముఖి వద్ద 8 కేజీల గంజాయి కొనుగోలు చేసి బస్సులో వస్తుండగా నరసన్నపేట పోలీసులు దేవాది ఫ్లై ఓవర్ వంతెన వద్ద గురువారం పట్టుకున్నారు. టోల్‌గేట్ వద్ద ఎస్‌ఐ బి.గణేష్ గురువారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా పాషా అనుమానాస్పదంగా కనిపించడంతో వెంబడించారని, దేవాది వద్ద పట్టుబడ్డాడని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
పవన్ కుమార్ అరెస్టు..
సారవకోటకు చెందిన ఎస్.పవన్ కుమార్‌ను గంజాయికి సంబంధించిన ప్రత్యేక చట్టం ద్వారా అరెస్టు చేసి విశాఖ సెంట్రల్ జైల్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తూ అధికసార్లు పట్టుబడిన వారిని ఈ విధంగా అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. పవన్ కుమార్‌పై నాలుగు గంజాయి కేసులు ఉన్నాయని, ప్రభుత్వ అనుమతితో శుక్రవారం అరెస్టు చేసి జైలుకు పంపించామన్నారు.


