శ్రీకాకుళం రూరల్: ‘మా స్కూల్.. మా ఇష్టం.. ఇక్కడికి రావడానికి ఎవరికీ అనుమతులు లేవు.. మేం వండిందే మెనూ..’ ఇదీ పెదపాడులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల వద్ద శుక్రవారం పరిస్థితి. గురువారం గురుకులంలో జరిగిన ఘటన చర్చనీయాంశం కావడంతో శుక్రవారం గురుకులం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పాఠశాల గేట్లు మూసేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. విలేకరులకు సైతం అనుమతి ఇవ్వలేదు. విద్యార్థులకు భోజనాలు అరకొరగానే పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుచి లేకపోవడంతో కొందరు విద్యార్థులు ఆహార పదార్థాలను డస్ట్‌బిన్‌లోనే పడేస్తున్నట్లు తెలిసింది. తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. స్నానాలకు తండేవలస నుంచి ఓ కెనాల్ ద్వారా నీటిని తెచ్చి ట్యాంకులు నింపుతున్నారని సమాచారం. ఉదయం వేగంగా లేచిన వారికి మాత్రమే స్నానానికి నీరు దొరుకుతుందని, మిగిలిన వారు ముఖం కడుక్కోని తరగతులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. కాగా, అంబేడ్కర్ గురుకులాల్లో తరచూ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నా సంబంధిత అధికారి సరిగ్గా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


