సారవకోట: ఆదివాసీలకు కూటమి నాయకులు అన్యాయం చేయడం తగదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు. శుక్రవారం సారవకోటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలో లేని కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చుతామని ప్రకటించడం, మంత్రి కార్యాలయం నుంచి పోస్టర్ కూడా విడుదల చేయడంతో ఆదివాసీలు భయాందోళనకు గురౌతున్నారన్నారు. జిల్లాల విభజన జరిగిన తరువాత శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ కావాలని ఉద్యమాలు, నిరసన దీక్షలు చేస్తున్నా పట్టించుకోకుండా జిల్లాలో లేని కులాన్ని ఎస్టీలో చేర్చి వారికి అన్ని ఫలాలు అందిస్తామని కేబినేట్ మాట్లాడం విచారకరమన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో లాభం పొందేందుకు మంత్రి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఆదివాసీలు ఉద్యమాలు చేసి స్థానిక ఎన్నికలలో తడాఖా చూపిస్తామన్నారు. ఇప్పటి వరకు లేని కులాలను ఎస్టీలలో చేర్పించాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌లు సైతం ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని, దీనిని ఆదివాసీలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.


