శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆదివాసీలు 42 ఏళ్లుగా మోసపోతున్నారని, ఆదివాసీలకు అందాల్సిన 6 శాతం రిజర్వేషన్లను దొంగ కుల ధ్రువీకరణ పత్రాలతో నకిలీ బెంతొరియాలు దోచుకుంటున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు. తక్షణమే నకిలీల ఏరివేతకు జిల్లా అధికారులు చొరవ చూపి నిజమైన బెంతొరియాలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాబ యోగి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నామని చెప్పుకుంటున్న బెంతొరియాలపై 1978లోనే అప్పటి జిల్లా కలెక్టర్ దానం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారన్నారు. ఆ నివేదికలో శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియా తెగ అనేది లేదని స్పష్టంగా తేల్చి చెప్పారన్నారు. ఆ తర్వాత గిరిజన సంస్కృతి సాంప్రదాయాల అధ్యయన కమిటీ కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, మెళియాపుట్టి, టెక్కలి, పాతపట్నం, సంతబొమ్మాళి మండలాల్లో పర్యటించిందని తెలిపారు. విజయనగరంలో ఉన్న అసలైన బెంతు ఒరియా తెగకు, శ్రీకాకుళంలో బెంతు ఒరియాలమని చెప్పుకుంటున్న వారికి ఎక్కడా పోలికలు లేవని, వీరంతా వడ్డీ కులస్తులని ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక ఇచ్చిందన్నారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఈ నకిలీలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ 105 కేసుల్లో తక్షణమే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి, మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేసి నిజమైన ఆదివాసీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీ సభ్యులకు వెంకటేష్, గణేష్, సవర సింహాచలం, జన్ని వాసు తదితరులు పాల్గొన్నారు.


