సమాజంలో తారతమ్యాలు తగ్గించాలంటే ఒక్క విద్యతోనే సాధ్యమవుతుందని నమ్మిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నిరుపేదలకు తొమ్మిది లక్షల ఎకరాలు భూమిని ఉచితంగా అందించిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. చంద్రబాబులాంటి దుర్మార్గులు వేలాది ఎకరాలను ప్రైవేటువ్యాపారులకు, లులూమార్ట్‌లకు కేవలం 99 పైసలకే అప్పగించి కోట్లాది రూపాయలు కమీషన్లు తీసుకుని జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 30లక్షల ఇళ్లు, ఇళ్ల స్థలాలను పేదలకు అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు జీవితంలో సెంటు భూమి అయినా కొనుగోలు చేసి ఒక్క పేదవాడికై నా అందించారా అని ప్రశ్నించారు. రైతులకు ఎరువులిచ్చి, పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, సాగునీటి ప్రాజెక్టులకు నిధులిచ్చి, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి, హామీలన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబుకి తేడా తెలుసుకోవాలని ప్రజల్ని కోరారు. కరోనా వంటి విపత్తు సమయంలో సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఉండబట్టే లక్షలాది మంది ప్రాణాలు నిలబడ్డాయని, అదే సమయంలో చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే రాష్ట్రం సగం ఖాళీ అయ్యేదన్నారు. పేదవాడికి జబ్బు చేస్తే ఇంటిలోనే మగ్గిపోయే పరిస్థితి నుంచి ఆరోగ్య రక్షణ కల్పించి ఇంటికి వెళ్లినప్పుడు చార్జీలకు డబ్బులిచ్చి పంపించిన ఘనత వైఎస్సార్, జగన్‌మోహన్‌రెడ్డిలదేనన్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలు విసుగుచెంది జగన్‌మోహన్‌రెడ్డి పాలన కోరుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యం బాగులేకపోయి తాను తప్పుకున్నా..ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా.. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు వైఎస్సార్‌సీపీకి సేవలందిస్తానని స్పష్టం చేశారు.


