వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వలరేవుకు ప్రతి ఏటా పొగురు సమస్య వెంటాడుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు కొండలతో పాటు మహేంద్రగిరి కొండలపై కురిసిన వర్షాలకు వరద నీరు బెండి జీవ గెడ్డ ద్వారా ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉప్పుటేరులోకి చేరుతోంది. అక్కడి నుంచి నువ్వలరేవు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ సమయంలో ఉప్పుటేరు–సముద్రం మధ్య పెద్ద ఎత్తున ఇసుక మేట వేయడంతో వరద నీరు గ్రామంలోకి చేరి ఊరంతా జలదిగ్బంధంలో చిక్కుకుంటుంది. బెండి, సీతాపురం, పెద్దబొడ్డపాడు, పూండిగల్లి, నగరంపల్లి, గుళ్లలపాడు గ్రామాల్లో సుమారు 600 ఎకరాలు నీటమునుగుతాయి. ఈ నేపథ్యంలో అధికారులపై ఆధారపడకుండా గ్రామస్తులే ఏకమై సుమారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి యంత్రాల సాయంతో పొగురు తొలగించారు. బుధవారం ఉదయం మత్స్యకారులంతా తీరానికి చేరుకు సముద్రానికి అడ్డంగా ఉన్న ఇసుక మేటను తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక మేట సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.


