● మండిపడిన ధర్మాన కృష్ణచైతన్య
నరసన్నపేట: మండలంలోని యారబాడులో ఎన్ని వేణునాయుడుకు చెందిన జిరాయితీ స్థలంలో నిర్మించుకున్న గోడను అధికారులు తొలగించడం దారుణమని, ఇది ముమ్మూటికీ కక్ష సాధింపేనని పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య మండిపడ్డారు. యారబాడులో అధికారులు కూల్చిన గోడను బుధవారం పరిశీలించిన అనంతరం బాధిత వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబాన్ని కృష్ణచైతన్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగమే ఈ కూల్చివేత అని మండిపడ్డారు. కోమర్తి, యారబాడుల్లో కూల్చివేతలకు పాల్పడ్డ అధికారులు ఎవరినీ వదిలి పెట్టమని హెచ్చరించారు. అలాగే నరసన్నపేట తహసీల్దార్, ఆర్‌ఐ, యారబాడు వీఆర్వో, సర్వేయర్ల పేర్లు నమోదు చేసుకున్నామని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీరి సంగతి చూస్తామని ధ్వజమెత్తారు. రాజకీయ విభేదాలతో స్థానిక టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ అధికారులు అతి చేశారని మండిపడ్డారు. అధికారులు పసుసు కండువాలు వేసుకొని పని చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. నరసన్నపేటలో చెరువు ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళి, నాయకులు లుకలాపు రవి, యాబాజి రమేష్, నేతింటి రాజేశ్వరరావు, సురంగి నర్శింగరావు, బొబ్బాది ఈశ్వరరావు, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.


