టెక్కలి: ఇటీవల తమిళనాడు తూత్తుకుడిలో నిర్వహించిన జాతీయ స్థాయి ఏఐసీసీ హ్యాకథాన్ పోటీల్లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ప్రతిభ కనబర్చినట్లు కళాశాల డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. దేశవ్యాప్తంగా 1,081 బృందాలు పాల్గొనగా, కళాశాలకు చెందిన కె.విష్ణువర్ధన్, జి.అరవింద్‌స్వామి, డి.తరుణ్‌కుమార్ తదితర బృందం రూపకల్పన చేసిన ‘కాష్యూ హబ్’ ప్రాజెక్టు బృందం ప్రతిభకు గుర్తింపుగా నిర్వాహకుల నుంచి నగదు బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా ఐతం రైజ్ ఇన్క్యూబేటర్ సీఈవో బి.మనోజ్‌కుమార్, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావుతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.
ఐటీబీపీ కానిస్టేబుల్ ఆత్మహత్య
మందస: మండలంలోని టబ్బగాం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐటీబీపీ కానిస్టేబుల్ సవర శేషగిరి (28) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒడిశాలోని ఖుర్దా యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్న శేషగిరి ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. గ్రామ సమీపంలోని జీడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విధి నిర్వహణలో పని ఒత్తిడితో కొంతకాలంగా మానసిక ఆందోళనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం పీహెచ్‌సీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నెలాఖరులోగా సోలార్ లక్ష్యం చేరుకోవాలి
అరసవల్లి: జిల్లా విద్యుత్ సర్కిల్‌లో పీఎం సూర్యఘర్ పథకం అమలు లక్ష్యాలను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఏపీ ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టివి.సూర్యప్రకాష్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఎస్సీ ఎస్టీ ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు కచ్చితంగా సోలార్ రూఫ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఎస్సీ ఎస్టీ వినియోగదారులు 16278 మంది ఉండగా, ఇంతవరకు 9032 ఇళ్లకు మాత్రమే సోలార్ పథకాన్ని అమర్చారని, మిగిలిన వారికి ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి చీఫ్ జనరల్ మేనేజర్ డి.సుమన్ కళ్యాణి, ఎస్‌ఈ జీఎన్.ప్రసాద్, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీముఖలింగం ఆలయంలో సంప్రోక్షణ పూజలు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం ప్రధాన దేవాలయంలో ఇంద్ర లింగానికి బుధవారం సంప్రోక్షణ, శుద్ధి పూజలు నిర్వహించారు. ‘శివ..శివా’ అనే శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి దేవదాయ శాఖ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు స్పందించారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి పవిత్ర వంశధార నదీ జలాలతో శుద్ధి చేసి భక్తులకు దర్శనాలు కలిగించారు. ఇదిలా ఉండగా ‘సాక్షి’లో వచ్చిన కథనానికి దేవదాయ శాఖ అధికారులు స్థానిక ఈఓ ఏడుకొండలను మందలించినట్లు సమాచారం. దీనిపై ఈఓ, అర్చకులు వాగ్వాదానికి దిగారు. జలుమూరు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు చొరవ తీసుకొని ఆలయ నిర్వహణ సమష్టిగా చూడాలని సర్దిచెప్పడంతో వివాదం సద్దు మణిగింది.
27 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి
శ్రీకాకుళం క్రైమ్ : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 27 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి అక్టోబరు 1 నుంచి ట్రైనింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత వీరికి ప్రమోషన్ కల్పించాల్సి ఉన్నా 27 హెచ్‌సీ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఈ ప్రక్రియ జరిపినట్లు పోలీసు వర్గాల సమాచారం.


