శ్రీకాకుళం పాతబస్టాండ్: పారిశుద్ధ్య నిర్వహణ, సంక్షేమ పాఠశాలల విభాగాల్లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచి అగ్రస్థానాల్లో నిలవడం అభినందనీయమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి బుధవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో 73.8 స్కోరుతో జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిందని, సాంఘిక సంక్షేమ పాఠశాలలు 76.90 పాయింట్లతో 3వ స్థానం, చిన్నారుల సంరక్షణలో 84.3 స్కోరుతో 5వ స్థానంలో నిలిచాయని వెల్లడించారు. మిగిలిన రంగాలు, బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలోనూ మెరుగైన ఫలితాలు సాధించి మరింత పురోగతి సాధించాలని సూచించారు. ఓవర్ హెడ్ ట్యాంకుల్లో వంద శాతం క్లోరినేషన్ పూర్తి చేసి, నీటి నమూనాలను క్రమం తప్పకుండా ల్యాబ్ పరీక్షలకు పంపాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లలో మరుగుదొడ్లు, తాగునీటి ప్లాంట్ల పనులు త్వరగా పూర్తి చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్ల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
మా త్యాగాలకు
ప్రతిఫలం ఇదా!
సంతబొమ్మాళి: మూలపేట పోర్టుకు గ్రామాన్ని, భూములను ఇచ్చి త్యాగాలు చేస్తే మా సమస్యలు పట్టించుకోరా? అంటూ విష్ణుచక్రం గ్రామస్తులు బుధవారం తహసీల్దార్ హేమసుందరావును నిలదీశారు. గ్రామంలోని ఏడు ఆలయాలకు పునరావాస కాలనీలో చెరువు గట్టును ఎలా కేటాయించారని ప్రశ్నించారు. చెరువు గట్టుపై విద్యుత్ హైటెన్షన్ వైర్లు ఉన్నాయని, ఇక్కడ నిర్మాణాలు చేస్తే ప్రమాదాలు జరుగుతాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఆలయాలకు కేటాయించిన 13 సెంట్ల స్థలాన్ని చూపించాలని డిమాండ్ చేశారు. పునరావాస కాలనీకి వచ్చి 17 నెలలు అవుతున్న ఆలయాలకు సంబంధించిన పరిహారం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.


