పసిడి కోసం పాశవికం..! | - | Sakshi
Sakshi News home page

పసిడి కోసం పాశవికం..!

Aug 30 2026 1:45 AM | Updated on Aug 30 2026 1:45 AM

పసిడి కోసం పాశవికం..! ఈ ఏడాది జరిగిన భారీ చోరీలు ఎవరిని నమ్మేది..?

బంగారం కోసం తెగిస్తున్న ముఠాలు అడ్డొస్తే హత్యలు చేస్తున్న వైనం అత్యంత నమ్మకస్తులతోనూ ప్రమాదమే జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసుల హెచ్చరికలు

రికవరీ పెంచుతాం

పసిడి మెరుపు నేరగాళ్ల కళ్లను కప్పేస్తోంది. బంగారం కనిపిస్తే చాలు దోచుకునేందుకు ఎంతకై నా తెగిస్తున్నారు. సులభంగా సొమ్ము చేసుకోవాలనే దురాశతో చోరీలు, దోపిడీలకు పాల్పడడమే కాకుండా.. అవసరమైతే హత్యలకు కూడా వెనుకాడడం లేదు. కొన్నిసార్లు నమ్మకస్తులు సైతం బరితెగిస్తున్నారు. ఆప్తులుగా మెలుగుతూ అదునుచూసి బంగారంపై కన్నేస్తున్నారు. ఇలా పసిడి చుట్టూ పెరుగుతున్న నేరాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి.

శ్రీకాకుళం క్రైమ్‌:

జిల్లాలో బంగారం నేరాలు సామాన్య ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏ క్షణాన గుర్తు తెలియని అగంతకులు షాపులు, ఇళ్లల్లో నగలు దోచేందుకు చొరబడతారో.. అడ్డుపడితే ఎక్కడ మారణాయుధాలతో దాడికి తెగబడి ప్రాణాలు తీస్తారోనని ఆందోళన చెందుతున్నారు. బంగారం ధర పెరగడంతో అత్యాశతో అత్యంత నమ్మకస్తులు సైతం సొంతమనుకున్నవారినే మట్టుబెడుతున్నారు. దీంతో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సైతం ప్రాపర్టీ నేరాలపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారనడానికి ఇటీవల చాలా కేసుల్లో పురోగతి లేకపోవడమే నిదర్శనంగా చెప్పవచ్చు. నెలలు, ఏళ్లు గడుస్తున్నా భారీ చోరీల్లో సొత్తు రికవరీ చేయకపోవడమే కాకుండా.. నేరం చేసి క్షణాల్లో దాటేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తులను పట్టుకోవడంలో చతికిలపడుతున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీన పట్టపగలు కాశీబుగ్గ వేంకటేశ్వర జ్యూయలర్స్‌లో వృద్ధుడైన యజమానికి బేడీలు వేసి గన్‌ నెత్తిన పెట్టి బెదిరించిన ఒడిశా, యూపీ డెకాయిట్‌లు 800 గ్రాముల బంగారంతో పాటు కొంత నగదును తీసుకొని సినీ ఫక్కీలో రాష్ట్రాలు దాటేశారు. అక్కడికి దాదాపు నెలరోజులకు ఒడిశాకు చెందిన ఐదుగురు డెకాయిట్ల దగ్గర 243 గ్రాముల బంగారాన్నే స్వాధీనం చేసుకున్నారు తప్ప, భయంకర యూపీ గ్యాంగ్‌ను పట్టుకోకపోవడంతో 557 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోలేకపోయారు. 260 పెండింగ్‌ కేసులున్న కాశీబుగ్గ జిల్లాలోనే క్రైమ్‌రేట్‌లో ప్రథమ స్థానంలో ఉంది. దీనికి తోడు రాజకీయ కేసుల జోక్యం అదనం కావడం, అది పోలీసులపై ఒత్తిడిగా మారి తమ జాబ్‌లు కాపాడుకోవడానికే టైం సరిపోతుందని ఇక్కడి పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారంటే ఏ స్థితిలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

●గత నెల 23న మడపాం పంచాయతీ కొత్తపేటకు చెందిన వ్యాపారి జామి నర్సింగరావు భార్యకు శస్త్ర చికిత్స నిమిత్తం విశాఖ వెళ్లి తిరిగి 28న వచ్చి చూసేసరికి ఇంట్లో 56 తులాల బంగారం పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 29న 34 తులాలు పోయిందని పోలీసులు కేసైతే నమోదు చేశారు గానీ గ్యాంగ్‌ ట్రేస్‌ అవ్వలేదు.

●ఈ ఏడాది ఆరంభంలో వజ్రపుకొత్తూరు మండలం పూండి–గోవిందపురంలో పంచాయతీ కార్యదర్శి ఇంట్లో 75 తులాల వెండి, ఐదున్నర తులాల బంగారం, నగదు రూ.90 వేలు దోచుకుపోగా, ఇదే పూండిలో రవికుమార్‌కు చెందిన బంగారం షాపులో దాదాపు 20 తులాల బంగారం మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా పట్టుకుపోయారు. అక్కడికి కొద్దిరోజుల్లోనే రవికుమార్‌ భార్య మెడలోంచి చైన్‌ తెంచుకొని పరారయ్యారు. ఇప్పటికీ ఈ ముఠా జాడ లేదు, సొత్తు రికవరీ కాలేదు.

●నరసన్నపేట ఇందిరానగర్‌లోని ఓ డెంటిస్ట్‌ ఇంట్లో దాదాపు 109 తులాలు చోరీకి గురై రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ పూర్తిగా రికవరీ కాలేదు. బీహార్‌ గ్యాంగ్‌లో కొందరిని పట్టుకున్నా వారిలో సూత్రధా రి పరారీలో ఉన్నారన్న కారణంతో 2 తులాలే రికవరీ చూపించడం, ఇప్పటికీ నిందితులను పట్టుకోకపోవడం పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం.

పెరుగుతున్న బంగారం ధరలు మానవత్వాన్ని మరిచేలా చేస్తున్నాయి. అత్యంత నమ్మకస్తులే బంగారం కోసం దాడులు, హత్యలు చేస్తుండడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఎవరిని నమ్మాలో తెలియడం లేదని ప్రజలు, షాపుల యజమానులు వాపోతున్నారు. అలాంటివి కొన్ని ఘటనలు పరిశీలిస్తే...

●మందస మండలం వీరభద్రలో గత నెల 31న తల్లిదండ్రులతో విభేదాలున్న కొడుకు వివేక్‌ మరో ముగ్గురిని సుపారీకి మాట్లాడి ముసుగు దాడి చేయడమే కాకుండా.. తల్లి మెడలోని బంగారు గొలుసు ఎత్తుకుపోయాడు.

●నరసన్నపేటలో ఏడాదిన్నరలోపే బంగారం దోచేందుకు అత్యంత నమ్మకస్తులు ముగ్గురిని హత్య చేశారు. గతేడాది ఆగస్టు 26న వ్యాపారి గుప్తాతో పాటు బంగారాన్ని తెచ్చేందుకు వెళ్లిన కారు డ్రైవర్‌ పెద్దపాడు మార్గమధ్యలో మరికొందరితో కలిసి హత్య చేసి భారీ మొత్తంలో బంగారాన్ని దోచేసి పోలీసులకు చిక్కాడు. గతేడాది మార్చి 2న కేవిటి గున్నమ్మ అనే వృద్ధురాలిని అతి కిరాతకంగా చంపి బంగారాన్ని దోచుకుని పారిపోయారు. తాజాగా చిన్నమ్మడును చంపి భారీ మొత్తంలో బంగారాన్ని దోచుకున్నారు.

●గతేడాది డిసెంబర్‌ 1న లావేరు మండలం మురపాకకు చెందిన వృద్ధురాలు వడ్డీ పార్వతి చెవి, ముక్కు కోసి కాల్చి పాడుబడిన బావిలో శవాన్ని పడేసి బంగారం దోచుకుపోయారు. ఈ కేసు ఇప్పటికీ తేలలేదు. సొంత కుటుంబీకులే హత్య చేశారన్న వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

●శ్రీకాకుళం నగరంలోని బాలాజీ నగర్‌లో వృద్ధురాలి మెడపై కత్తిని పెట్టి చంపుతానని బెదిరించి బంగారు తాడును పట్టుకుపోగా, న్యూకాలనీలో కళావతిని నగలు కోసమే పరిచయస్తుడు హత్య చేశాడు.

బంగారు ఆభరణాలు ధరించి వెళ్లే సమయంలో మహిళలు ముఖ్యంగా వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నది ముందుగానే కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. అవసరం లేకున్నా భారీగా ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లరాదు. కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన వ్యక్తులతో కలిసి వెళ్లాలి. బంగారం ధరలు అధికంగా పెరగడంతో మనకు పరిచయం ఉన్నవారినుంచే ముప్పు వాటిళ్లుతోంది. గతంతో పోల్చుకుంటే 2024 నుంచి ఇప్పటివరకు రికవరీ శాతం బాగా పెంచాం. భారీ చోరీలను ఛేదిస్తున్నాం. మరింత కష్టపడి రికవరీ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తాం.

– కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement