కొత్తూరు: నిబంధనలను కాలరాసి.. నియమాలను తుంగలో తొక్కి పశువులను అక్రమ రవాణా చేస్తున్నారు. రైతుల ముసుగులో ఈ అక్రమాలను దర్జా గా చేస్తున్నారు. కొత్తూరు మండలంలోని బలద సంత పశువుల అక్రమ రవాణాకు కేరాఫ్‌గా మారుతోంది. ఒడిశాకు ఆనుకుని ఉన్నందున రవాణా సులభంగా జరిగిపోతోంది. జంతు సంక్షేమ కమిటీ వారు కన్నెత్తి కూడా చూడకపోవడంతో మూగజీవాలు సరిహద్దులు దాటి వెళ్లిపోతున్నాయి.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
● జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ సమన్వయ కమిటీ పనిచేస్తుంది. మండల స్థాయిలో తహసీల్దార్, ఎస్‌ఐ, ఎంపీడీఓ, మండల పశు వైద్యాధికారులు సమన్వయ కమిటీగా ఏర్పడి పశువుల అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలి.
● జిల్లా సరిహద్దుల్లో, సంతల సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి.
● నిబంధనలకు వ్యతిరేకంగా పశువులను అక్రమంగా రవాణా చేసిన వారిపై క్రూరత్వ నిరోధక చట్టం(పీసీఎ–1960 చట్టం) ప్రకారం కేసులు నమోదు చేయాలి.
● పట్టుకున్న పశువులను సమీపంలోని గోసంరక్షణ శాలకు తరలించి, వారి బాగోగులు చూసేందుకు చర్యలు తీసుకోవాలి.
● పశువులను రవాణా చేసినప్పుడు పశువైద్యాధికారి మంజూరు చేసిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.
● పశువులకు ఆహారంతో పాటు దాణాను వాహనాల్లో ఏర్పాటు చేసి వాటికి అనుకూలంగా ఉన్న వాహనాల్లోనే తరలించాలి.
జిల్లాలో ఏం జరుగుతోంది..?
● కొత్తూరు మండలంలోని బలద, నారాయణవలస, కొల్లివలస, చింతాడ వారపు సంతల్లో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు.
● ఈ సంతల్లో నుంచి ప్రతి వారం పశువులను గోవధ శాలలకు పంపిస్తున్నట్లు సమాచారం.
● పలు కంపెనీల నుంచి వచ్చిన ఏజెంట్లు సంతలో దళారుల ద్వారా పశువులను కొనుగోలు చేస్తున్నారు.
● ఒడిశాకు ఆనుకుని ఉన్నందున ఇక్కడకు ఎక్కువగా పశువులను తీసుకువచ్చి అమ్ముతారు.
● ఈ పశువులను కొనుగోలు చేశాక ఇరుకు వాహనాల్లో తీసుకెళ్తూ నరకయాతనకు గురి చేస్తున్నారు.
● జిల్లాలోని వారపు సంతల్లో కొనుగోలు చేసిన పశువులను ఒడిశా రాష్ట్రంలోని గ్రామాలకు తరలించి అక్కడ వాహనాల్లో పశువులను ఎక్కించి గోవధ శాలలకు తరలిస్తున్నట్లు తెలిసింది.
● ఒడిశాలో లోడు చేయడంతో జిల్లా పోలీసులకు సమాచారం ఉన్నా చర్యలు తీసుకోలేని పరిస్థితి.
● కొత్తూరు మండలం బలద సంతలో రైతుల ముసుగులో కొంత మంది వ్యాపారులు పశువులను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం.
బలదలో దళారీల ద్వారా పశువుల కొనుగోలు
విశాఖ, కాకినాడ, హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాలకు తరలింపు
ఆరోగ్య సర్టిఫికెట్లు లేకుండానే రవాణా
రైతుల ముసుగులో పశువులతో వ్యాపారం
జాడ లేని జంతు సంక్షేమ సంఘం
జంతు సంక్షేమ సంఘం ఏదీ?
సంతల నుంచి పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి ప్రభుత్వం నియమించిన జంతు సంక్షేమ సంఘం సక్రమంగా తమ బాధ్యతలను నిర్వహించడం లేదు. సంఘంలో ఉన్న అధికారులు సక్రమంగా తనిఖీలు నిర్వహించాలి.
– గేదెల మన్మధరావు, కొత్తూరు విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి
అక్రమ రవాణా అరికట్టాలి..
జిల్లా నుంచి పశువులు గోవధ శాలకు ఎక్కువగా తరలిస్తున్నారు. సంతలో కొనుగోలు చేసిన పశువులను కొంత దూరం వరకు తీసుకెళ్లి అక్కడ వాహనాల్లోకి ఎక్కిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు.
– పొగిరి రవి, టీటీడీ ధర్మ ప్రచారక్ కొత్తూరు
నిఘా పెట్టాం
బలద సంతలో పశువుల అక్రమ రవాణా జరగకుండా నిఘా పెట్టాం. ప్రతి మంగళవారం సంతలో పోలీస్‌లు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారు. బలద సంతలో అక్రమ రవాణా జరిగినట్లు మా దృష్టికి రాలేదు.
– కె.వెంకటేష్ ఎస్‌ఐ, కొత్తూరు మండలం


