శ్రీకాకుళం న్యూకాలనీ: తైక్వాండో సమరంలో శ్రీకాకుళం జిల్లా మరోసారి తన సత్తాచాటుకుంది. సిక్కోలు వేదికగా జరిగిన మూ డు రోజుల రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఆతిథ్య శ్రీకాకుళం క్రీడాకారులు అదిరేటి ఆటతీరును కనబర్చి విజయదుందుభి మోగించారు. న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కల్యాణ మండపం వేదికగా జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్ జిల్లాల) తైక్వాండో చాంపియన్‌షిప్–2026 పోటీలు ముగిశాయి. కన్నుల పండువలా మూడు రోజులపాటు ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు కేడిట్ విభాగంలో మూడో స్థానం, జూనియర్స్‌లో రెండో స్థానంలో నిలిచారు. పూమ్‌సే విభాగంలో విజయనగరం జిల్లా విజేతగా నిలిచింది. సబ్‌జూనియర్స్ విభాగంలో విశాఖపట్నం చాంపియన్‌గా నిలవగా, సీనియర్స్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా చాంపియన్‌గా నిలిచింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ టైటిళ్లు, పతకాలు పంపిణీ చేశారు. పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తైక్వాండో రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు, జిల్లా కార్యదర్శి కొమర భాస్కరరావు కృతజ్ఞతలు తెలిపారు.


