ఎచ్చెర్ల: శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అర్హత గల అభ్యర్థులకు ఏపీఐసెట్–2026 ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆన్‌లైన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో సమస్యలుంటే నేరుగా కళాశాలకు వచ్చి పరిష్కరించుకోవచ్చు. వీటికి సంబంధించి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు, రిజి స్ట్రేషన్ ఈ నెల 24 వ తేదీ నుంచి 31 వరకూ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 25 వ తేదీ నుంచి వచ్చే నెల 1 వ తేదీ వరకూ చేసుకోవచ్చు. ఆప్షన్ల ఎంట్రీ ఈ నెల 27 వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ చేసుకోవచ్చు. ఆప్షన్లు మార్చుకోవాలంటే వచ్చే నెల 3 వ తేదీలోగా చేసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 7వ తేదీన సీట్ల అలాట్‌మెంట్ చేయ నున్నారు. సెల్ఫ్ జాయినింగ్‌లు వచ్చె నెల 8 వ తేదీనుంచి 11 వరకూ నిర్వహించనున్నారు. వచ్చెనెల 8 నుంచి క్లాసులు ప్రారంభించనున్నారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు మాత్రం నేరుగా ఈ నెల 31 తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకూ విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లి వెరిఫికేషన్ చేసుకోవాలి.
చిక్కాలవలసలో విరిగిన విద్యుత్ స్తంభాలు
నరసన్నపేట: చిక్కాలవలస కుమ్మరివీధిలో శనివారం రాత్రి రెండు విద్యుత్ స్తంభాలు విరిగి రేక్ షెడ్, ప్రహరీలపై పడ్డాయి. అయితే ఎవరికీ ఎ లాంటి ప్రమాదం జరగలేదు. అంబటి రాంబాబు కుమ్మరి శాల, పండూరి తవుడు ప్రహరీలపై పడటంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోల్స్ సక్రమంగా వేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. వర్షాలకే ఇలా పోల్స్ పడిపోతే ఎలా అని గ్రామస్తులు అంటున్నారు.
డీఎస్సీ అవకతవకలపై బీజేపీ నాయకుడి నిరసన
నందిగాం: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి, బీజేపీ సభ్యత్వానికి మండలం దేవళభద్రకు చెందిన చింతాడ శ్రీనివాస్ ఆదివారం రాజీనామా చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలపై వచ్చిన ఆరోపణలు, అభ్యర్థుల ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన జిల్లా అధ్యక్షునికి సమాచారం అందించారు.
ముగిసిన సాఫ్ట్‌బాల్ సబ్ జూనియర్స్ జట్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో అనతి కాలంలో సాఫ్ట్‌బాల్ క్రీడకు గణనీయమైన ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉందని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో జిల్లాస్థాయి సబ్–జూనియర్స్ బాలబాలికల జట్ల ఎంపికలు జరిగాయి. సుమారు 150 మంది క్రీడాకారులు హాజరై తమ ప్రతిభ నిరూపించుకున్నారు. పాఠశాలస్థాయిలో సాఫ్ట్‌బాల్ క్రీడ పట్ల విద్యార్థుల్లో మక్కువ పెరగడం అభినందనీయమని సంఘ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎంపిక చేసిన జిల్లా జట్లను విజయనగరం జిల్లా బొబ్బిలి వేదికగా సెప్టెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్‌జిల్లాల) సబ్ జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2026 పోటీలకు పంపించనున్నట్టు సంఘ రాష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకటరమణ, ఉపాధ్యక్షుడు మెట్ట తిరుపతిరావు పేర్కొన్నా రు. ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన చెరో 20 మంది క్రీడాకారులను జిల్లా ప్రాబబుల్స్ జట్లకు ఎంపికచేశారు. వారికి శిక్షణా శిబిరాలను నిర్వహించిన అనంతరం తుది జట్లను ప్రకటించనున్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.సాంబ మూర్తి, సలహాదారు పి.సుందరరారావు, సాఫ్ట్‌బాల్ సంఘ ప్రతినిధులు అన్నెపు రాజగోపా ల్, ఢిల్లీశ్వరరావు, మహంతి, మధుసూదన్, వెంకటరమణ, హరికృష్ణ పాల్గొన్నారు.


