● మూడుసార్లు కూలిన డ్రైనేజీ
● రూ.12 కోట్ల పనుల నిర్వహణపై ఆరోపణలు
● ప్రారంభించకుండానే కూలుతున్న నిర్మాణాలు
సరుబుజ్జిలి: అక్కడ రోడ్డు విస్తరణ పనులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఇంకా ప్రారంభమే కాలేదు.. కానీ మూడుసార్లు కాలువ నిర్మాణం కుప్పకూలింది. రూ.12 కోట్లతో జరుగుతున్న పనుల సమర్థతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉపాధి నిధులతో సరుబుజ్జిలి జంక్షన్‌లో అలికాం–బత్తిలి రహ దారిలో సుమారు 2 కిలోమీటర్లు, పాలకొండ– కొమానాపల్లి రహదారిలో సుమారు 600 మీటర్లు రహదారుల విస్తరణ, డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖాధికారులకు పనులు అప్పగించడం వల్ల కాంట్రాక్టర్ ఆడిందే ఆట పాడిందే పాటగా పనులు సాగుతున్నాయి. నాలుగు రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించకుండానే కుప్పకూలడంతో నాణ్యత ఇట్టే అర్థమవుతోందని ప్రజలు అంటున్నారు. హిరమండలం రహదారిలో నిర్మిస్తున్న డ్రైనేజీ ఇప్పటివరకు 3సార్లు కూలిపోయింది. అదేవిధంగా నిర్మాణం చేపట్టిన రహదారి కూడా చాలా చోట్ల దిగబడి కుంగిపోయింది. తప్పులు కప్పిపుచ్చుకొనేందుకు కాంట్రాక్టర్ కూలిన చోట ఆనవాళ్లు లేకుండా పొక్లెయినర్‌తో తవ్వకాలు చేపట్టడం గమనార్హం. ఈ విషయమై వివరణ కోసం ఆర్‌అండ్‌బీ ఈఈను సంప్రదించగా స్పందించలేదు.


