● జీవో నంబర్ 396 తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ● ఆందోళన వ్యక్తం చేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు ● ఉపాధి కోల్పోతామని ఆవేదన ● ప్రైవేటు ఏజెన్సీలతో తిప్పలు తప్పవని క్రయ, విక్రయదారుల ఆందోళన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాజకీయ నాయకులు మొదలుకుని ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు, మేధావులు, సాధారణ ప్రజలు సైతం భూములు కొనుగోలు, అమ్మకాలు చేసేటప్పుడు తప్పనిసరిగా డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయించి తమ క్రయ, విక్రయ వ్యవహారాలు సాగించడం బ్రిటీష్ కాలం నుంచి సాగుతున్న ప్రక్రియ. డాక్యుమెంట్ రైటర్ల కంటే ఎంతో నాలెడ్జ్ ఉన్నవారికి సైతం తప్పనిసరిగా దస్తావేజు లేఖర్లు రాసిన రాతలపైనే పూర్తి విశ్వాసం ఉంటుంది. ఇలా ఎంతోమందికి ఉపయోగపడుతున్నవారిని ఇరుకునపెట్టే జీవో నంబర్ 396ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు తీసుకురానున్నట్లు ప్రకటించింది. తద్వారా రూ.2 వేలు రుసుము చెల్లిస్తే, 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిపోతుందని చెబుతోంది. అయితే రిజిస్ట్రేషన్ చేయాలనుకునేవారు ఎంత పరపతి ఉన్నవారైనా ఒక్క పూటంతా సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ పూర్తిచేసేస్తామన్న కూటమి ప్రభుత్వం చెప్పే అబద్దాలు నమ్మే పరిస్థితి లేదని క్రయ, విక్రయదారులు చెబుతున్నారు. పోనీ ఈ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వపరం చేసినా లబ్ధిదారులకు ఉపయోగం ఉండేది. కానీ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి కమీషన్ కొట్టేసి, తద్వారా డబ్బులు సంపాదించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వందేళ్లుకు పైగా ఉన్న వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలన్న కూటమి పాలకుల ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు ఈనెల 6వ తేదీ నుంచి ఆందోళనలు, శాంతియుత నిరసనలు, పెన్‌డౌన్ కార్యక్రమాలు చేపడుతున్నారు.
రోడ్డునపడే ప్రమాదం
శ్రీకాకుళం జిల్లాలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, రైటర్ల అసిస్టెంట్లు మొత్తంగా జిల్లాలో 600 మందికి పైగా ఉంటారు. ఒక్క జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 160 మందికి పైగా ఉన్నారు. వీరిపై వారి కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. దీంతో కొత్త జీవో వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 100 మందికి పైగా రోడ్డునపడే ప్రమాదం ఉంది. కాగా జీవో నంబర్ 396ను ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పిన వెంటనే రూ.3 కోట్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఈ జీవో అమలు చేయనున్నట్లు పత్రికల్లో ప్రచురితమవ్వగానే ఈనెల 6, 7 తేదీల్లో పెన్‌డౌన్ చేశారు. అంతేకాకుండా ఈనెల 20వ తేదీ నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చింది.
డాక్యుమెంట్ రైటర్లు పెన్‌డౌన్ చేస్తున్నా అందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కసారిగా పెన్‌డౌన్ చేయడంతో డాక్యుమెంట్లు, ఆదాయం తగ్గింది. మోడల్ డాక్యుమెంట్‌ని వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చాం. అధికారికంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. డాక్యుమెంట్ రైటర్లతో పనిలేకుండా ఇంటర్‌నెట్ సాయంతో డాక్యుమెంట్స్ తయారు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. మధ్యవర్తిత్వం, అవినీతిని తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
– బి.సంజీవయ్య, రిజిస్ట్రార్, శ్రీకాకుళం జిల్లా
డాక్యుమెంట్ రైటర్ల పొట్టకొట్టే జీవోను రద్దు చేయాలి. ఆర్‌ఎస్‌కేలతో ప్రైవేటు సంస్థలకు లాభం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తినే నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పటికిప్పుడు వేరే పనులు చూసుకోలేము. కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి మా వృత్తిని కాపాడాలి.
– శ్రీనివాస్ పాత్రో,
స్టాంప్ వెండర్, శ్రీకాకుళం
వందేళ్ల చరిత్ర ఉన్న దస్తావేజు లేఖరుల బతుకులు రోడ్డున పడేయడం సరికాదు. జీవో 396ను అమలు చేస్తే కుటుంబాలను పోషించుకునేందుకు ఇబ్బందిపడతాం. ఈ వృత్తినే నమ్ముకుని బతుకున్న మేము ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం కనికరించకపోవడం సరికాదు.
– బి.గోవింద్, డాక్యుమెంట్ రైటర్, శ్రీకాకుళం


