వాటర్‌ ట్యాంకర్‌ @ రూ. 800 | - | Sakshi
Sakshi News home page

వాటర్‌ ట్యాంకర్‌ @ రూ. 800

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

మూలపేట పోర్టు నిర్వాసితులకు నీటి కష్టాలు

తాగునీరు, ఇంటి నిర్మాణాల కోసం ట్యాంకర్లు తెచ్చుకుంటున్న వైనం

పట్టించుకోని అధికారులు

పైపులైన్‌ లీకు వల్లే..

వాటర్‌ ట్యాంక్‌ వద్ద పైప్‌లైన్‌ లీకయ్యింది. శ్రీకాకుళం నుంచి మెటీరియల్‌ తెప్పించాం. వెంటనే మరమ్మతులు చేసి తాగునీటిని అందిస్తాం.

– ఆర్‌.మహేష్‌కృష్ణ,

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, సంతబొమ్మాళి

డ్రైనేజీలు అస్తవ్యస్తం..

పునరావాస కాలనీలో డ్రైనేజీల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. రోడ్డు కంటే చాలా దిగువున చిన్నపాటి వెడల్పుతో కాలువలు చేపట్టారు. దీంతో నీరు నిల్వ ఉండిపోయి ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించాలి.

– జీరు విశ్వనాథం, నిర్వాసితుడు, మూలపేట

సంతబొమ్మాళి : మూలపేట పోర్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు ఘోరంగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా నీటి అవసరాలు తీర్చడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. నౌపడలోని పునరావాస కాలనీలో ఇంటి నిర్మాణాలకు, తాగేందుకు నీరు లేక ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

పోర్టు నిర్వాసిత గ్రామమైన మూలపేటలోని 506 కుటుంబాలకు నౌపడలో పునరావాసం కల్పించారు. సంక్రాంతి ముందు లాటరీ పద్ధతి ద్వారా ప్రతి కుటుంబానికి ఐదు సెంట్లు చొప్పున ప్లాట్లు కేటాయించారు. అప్పటి నుంచి వారంతా తాత్కాలికంగా షెడ్లలో నివాసం ఉంటున్నారు. పూర్తిస్థాయిలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు నీటి సమస్య అడ్డంకిగా మారుతోంది. ఇక్కడ ఉన్న కుళాయిల ద్వారా నీరు రాకపోవడంతో తాగేందుకు, గృహ నిర్మాణాలకు ట్యాంకర్లే ఆధారమవుతున్నాయి. ఒక్కో ట్యాంకర్‌కు రూ.800 వెచ్చించి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. పని బట్టి రోజుకు రెండు నుంచి మూడు ట్యాంకర్లు అవసరమవుతుండటంతో నిర్వాసితులపై అదనపు భారం పడుతోంది.

తాగునీరు, డ్రైనేజీలదీ అదే దారి..

కుళాయిల ద్వారా కనీసం తాగేందుకు కూడా నీరు రాకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లి క్యాన్లు ద్వారా తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. రోడ్డు కంటే చాలా దిగువన డ్రైనేజీలు నిర్మాణం చేపట్టడంతో ఇటీవల కురిసిన వర్షాలకు అందులో నీరు నిలిచిపోయింది. ఈ నీటిని కొందరు మోటార్ల ద్వారా తోడాల్సిన పరిస్థితి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించడంతో పాటు కాలువలను ఎత్తు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement