వినిపిస్తుందా? | - | Sakshi
Sakshi News home page

వినిపిస్తుందా?

Jul 15 2026 12:23 AM | Updated on Jul 15 2026 12:23 AM

హలో హలో.. వినిపిస్తుందా?

అన్నింటా అవస్థలే..

ఉద్దానంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ సమస్య

తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులు

సరైన సిగ్నల్స్‌ లేక పౌరసేవల్లోనూ

తీవ్ర జాప్యం

డిజిటల్‌ ఇండియా తమకు వర్తించడం లేదని స్థానికుల ఆవేదన

హలో హలో..

కంచిలి : హైస్పీడ్‌ నెట్‌, 5జీ, 4జీ సంగతి తర్వాత.. ముందు మాట్లాడటానికి సిగ్నల్స్‌ వస్తే చాలని భావిస్తున్నారు ఉద్దాన ప్రాంతంలోని అనేక గ్రామాల ప్రజలు. కాల్‌ డ్రాప్‌లు, బలహీన సిగ్నల్‌, అతి నెమ్మదైన ఇంటర్నెట్‌ వంటి సమస్యలను ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్నా పరిష్కారం మాత్రం దక్కడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశమంతా డిజిటల్‌ ఇండియా గురించి మాట్లాడుతుండగా.. ఉద్దానం ప్రజలు మాత్రం ఇప్పటికీ ఒక ఫోన్‌ కాల్‌ చేయాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్తేకాని సాధ్యం కావడం లేదు.

సమస్య ఏంటో..

మొబైల్‌ నెట్‌వర్క్‌ను టెలికాం సంస్థలు నిర్వహిస్తాయి. ఇవి తమ వ్యాపార లాభాలు, సాంకేతిక అవసరాలు, ప్రభుత్వ అనుమతులు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని నెట్‌వర్క్‌ను విస్తరిస్తాయి. అయితే రాజకీయాలకు సంబంధం లేదా అంటే.. పరోక్షంగా సంబంధం ఉంటుందనే చెప్పాలి. ప్రభుత్వాలు డిజిటల్‌ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యంగా తీసుకుంటే, టవర్‌ అనుమతులు వేగంగా ఇవ్వడం, ప్రభుత్వ భూములు కేటాయించడం, విద్యుత్‌, ఫైబర్‌ కనెక్టివిటీ వంటి అంశాల్లో సహకారం అందించగలవు. ప్రజాప్రతినిధులు నిరంతరం ఒత్తిడి తీసుకొస్తే అభివృద్ధి వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ చర్యలు లేకపోతే అభివృద్ధి ఆలస్యం అవుతోంది.

అదనపు టవర్లు ఏవీ?

ఉద్దాన ప్రాంత గ్రామాల్లో ఎక్కువగా కొబ్బరి, జీడి, మామిడి తదితర పంటలు వ్యాప్తి చెంది ఉన్నాయి. ఇక్కడ మొబైల్‌ టవర్ల నిర్మాణం ఎక్కువ అవసరం పడుతుంది. మైదాన ప్రాంతాల కంటే ఇక్కడ నెట్‌వర్క్‌ సమస్య ఎక్కువగా ఉంటోంది. మొబైల్‌ కంపెనీలు వ్యాపార దృక్పథం కంటే నాణ్యమైన నెట్‌వర్క్‌ అందించేందుకు కాస్త పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి ఉంది. దీని కోసం ప్రజాప్రతినిధులు తమ వంతుగా టెలికాం సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన ప్రయత్నాలు ఎంతవరకు జరుగుతున్నాయో నేతలకే తెలియాలి.

అధిక రీచార్జులు చెల్లిస్తున్నా..

వినియోగదారులు 5జీ నెట్‌వర్క్‌ సేవల కోసం రీచార్జి చేస్తుంటే వాస్తవంగా ఇక్కడ అందేది మాత్రం 4జీ.. అంతకంటే తక్కువ స్పీడు. ప్రతి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్‌ ఫోన్లు ఉన్నప్పటికీ అదే స్థాయిలో అవసరమైన టవర్లు ఇక్కడ ఏర్పాటు చేయలేదు. దీంతో ఒకే టవర్‌పై వేలాది మంది వినియోగదారులు ఆధారపడటం వల్ల సిగ్నల్‌ బలం, ఇంటర్నెట్‌ వేగం తగ్గడం జరుగుతోంది. 5జీ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో వినియోగదారులు చెల్లిస్తున్న ధరకు తగిన సేవలు అందిస్తున్నారా అనే ప్రశ్నకు టెలికాం సంస్థల వద్ద సమాధానం కరువవుతోంది.

ప్రతి గ్రామంలో తెల్లవారే సరికి ఉపాధి హామీ పథకం పనులు చేయడానికి వెళ్లే వేతనదారులకు మొబైల్‌ హాజరు అనేది సమస్యగా మారింది. యాప్‌లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు వివరాలు అప్‌లోడ్‌ చేసేందుకు నెట్‌వర్క్‌ సమస్య తీవ్ర ఆటంకంగా మారుతోంది. ప్రతినెలా సామాజిక పింఛన్ల పంపిణీలో కూడా ఉద్దానం ప్రాంతంలో నెట్‌వర్క్‌ సమస్యలతో చాలా సార్లు జాప్యం జరుగుతోంది. ప్రతి సచివాలయం పరిధిలో ఉద్యోగుల హాజరు కూడా ఇంటర్నెట్‌పైనే ఆధారం. ప్రస్తుతం భారత ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న సర్‌ ప్రక్రియ పూర్తిగా మొబైల్‌ నెట్‌వర్క్‌ మీదే ఆధార పడిఉంది. ఈ ప్రాంతంలోని బలహీనమైన నెట్‌వర్క్‌తో బీఎల్‌ఓలు అవస్థలు పడుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టెలికాం సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఉద్దానం ప్రాంతానికి ప్రత్యేక నెట్‌వర్క్‌ అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి. దీని కోసం గ్రామాలవారీగా సిగ్నల్‌ సర్వే చేసి, అవసరమైన చోట కొత్త టవర్లు ఏర్పాటు చేసి ఫైబర్‌ కనెక్టవిటీ బలోపేతం చేయాలి. మొబైల్‌ నెటవర్క్‌ అనేది విలాసం కాదని.. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి వంటి అత్యవసర సేవలు, ప్రభుత్వ సేవలకు ప్రాథమిక మౌలిక సదుపాయంగా గుర్తించాలి. ఉద్దానం ప్రజలకు నాణ్యమైన నెట్‌వర్క్‌ అందించడం అభివృద్ధిలో కీలకమైన అడుగు. ప్రస్తుతం మొబైల్‌ ఇంటర్నెట్‌ బలంగా లేకపోవడంతో చాలా పౌరసేవలు అందించడంలో అధికార యంత్రాంగం ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కోకొల్లలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement