శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో శ్రీకాకుళం జిల్లాలో పలువురిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్రకార్యదర్శిగా ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన ఇసాయి వెంకటరావుని, రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శిగా పాతపట్నం నియోజకవర్గం నుంచి సవర రమేష్‌ని, రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శిగా చింతాడ సూర్యనారాయణను, రాష్ట్ర వాణిజ్య విభాగం సంయుక్త కార్యదర్శిగా పాతపట్నం నియోజకవర్గం నుంచి ఎరుకోల వెంకటరమణను, రజక విభాగం జిల్లా అధ్యక్షులుగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి నడుపూరి ఏసుపాదంను నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు.
‘చెత్త నుంచి సంపద’ కేంద్రం స్థలం ఆక్రమణ
నందిగాం: మండలంలోని ప్రతాపవిశ్వనాథపురం పంచాయతీ ప్రతాపవిశ్వనాథపురంలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం స్థలంలో గ్రామానికి చెందిన వ్యక్తి ఆక్రమించి పునాదులు తవ్వారు. తనకు ఉన్న కొద్ది స్థలంతో పాటు పక్కనున్న ఈ స్థలంలో కూడా పునాదులు తీసి కట్టడానికి పూనుకుంటున్నారు. ఇంతకాలం సర్పంచ్‌ల పదవీ కాలం ఉండటంతో గుమ్మనంగా ఉన్న వారు పదవీకాలం ముగియడంతో స్థానిక తెలుగుదేశం నాయకుడి అండతో ఈ ఆక్రమణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు దృష్టిసారించి ప్రభుత్వ కేంద్రాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
పిచ్చికుక్క దాడిలో
10 మందికి గాయాలు
హిరమండలం: హిరమండలంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. 10 మందిని గాయపరచింది. దీంతో వారికి హుటాహుటిన స్థానిక పీహెచ్‌సీలో వైద్యసేవలందించారు. ఉదయం పిచ్చికుక్క స్థానికులపై ఎగబడింది. కనిపించిన వారిపై దాడిచేసింది. కుక్క దాడిలో పిల్లి ప్రసాద్, ఎస్.బాపన్న, డి.ముకుంద, టి.రామలక్ష్మీ, ఎస్.నూకరాజు, ఎస్.వెంకటరమణ, లోపింటి అప్పారావు, ఇంటి మల్లేశ్వరరావు ఏ.ఈశ్వరరావు తదితరులు గాయపడ్డారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా పీహెచ్‌సీ వైద్యాధికారి పి.సాయికుమార్ వైద్యసేవలందించారు. కాళ్లతో పాటు శరరీంలో పలు భాగాలను కరిచింది. గత రెండు రోజులుగా ఈ కుక్క స్థానికులను ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.
జీడి తోటలకు సస్యరక్షణ అవసరం
పలాస: ఉద్దానం ప్రాంతంలోని జీడి తోటలకు తక్షణమే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను రక్షించుకోవాలని ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలు సూచించారు. ఈ మేరకు పలాస మండలం బొడ్డపాడు, మాకన్నపల్లి, మామిడిపల్లి తదితర గ్రామాల్లో గురువారం పర్యటించి జీడితోటలను పరిశీలించారు. గ్రామాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి సలహాలు సూచనలు చేశారు. అకాల వర్షాల వల్ల, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల జీడి పంటకు వివిధ రకాలు తెగుళ్లు వ్యాపించాయని, వాటి ఉద్ధృతి తీవ్రంగా ఉందన్నారు. జీడిపూత, పిక్క మాడిపోతుందన్నారు. వీటి నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో శాస్త్ర వేత్తలు డాక్టర్ జి.స్రవంతి, టి.రాజశేఖర్, పలాస ఉద్యాన వన శాఖాధికారి సీహెచ్ శంకరదాసు, కె.వెన్నెల, నీలమణి, రైతులు పాల్గొన్నారు.


