శ్రీకాకుళం: నగరంలో డయేరియా పరిస్థితుల నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను జిల్లా యంత్రాంగం ముమ్మరం చేసింది. జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సెవెన్ రోడ్ జంక్షన్‌లోని అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన ఆయన, అక్కడ పారిశుద్ధ్య నిర్వహణను స్వయంగా పరిశీలించారు. అనంతరం కాజీపేటతో పాటు నగరపాలక సంస్థలోని పలు వార్డుల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పారిశుద్ధ్య పనుల కోసం మంగళవారం ఒక్కరోజే మొత్తం 17 జేసీబీలు, 24 ట్రాక్టర్లను రంగంలోకి దించారు. 84 ట్రిప్పుల ద్వారా మొత్తం 147 టన్నుల పూడిక, 39.25 టన్నుల చెత్తను కలిపి మొత్తం 186.25 టన్నుల వ్యర్థాలను నగరం వెలుపలికి తరలించారు. రోడ్లపై పశువుల సంచారం లేకుండా చూసేందుకు మంగళవారం 7 పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
తగ్గని డయేరియా
శ్రీకాకుళం: నగరంలో డయేరియా వ్యాప్తి తగ్గడం లేదు. నిత్యం నగరంలోని ఏదో ఒక చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవల ఉద్ధృతంగా వ్యాధి కనబడిన దమ్మల వీధి, కాకి వీధి తదితర ప్రాంతాల్లో కూడా కేసులు వస్తూనే ఉన్నాయి. తాజాగా వీటిని ఆనుకొని ఉన్న లెప్రసీ కాలనీ దండి వీధి ప్రాంతాల్లో మంగళవారం రెండు కేసులు నమోదయ్యాయి. దండి వీధికి చెందిన ఓ మహిళ, లెప్పర్సీ కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలుడు డయేరియాతో బాధపడుతూ రిమ్స్‌లో చేరారు. చిన్న బొందిలీపురంలో ఇద్దరు బాలబాలికలు డయేరియాతో రిమ్స్‌లో చేరారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారు కూడా ఉన్నారు. ఆరోగ్య శాఖ ఈ వివరాలను ప్రకటించడం లేదు.
వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు మాయం
పొందూరు: మండలంలోని లోలుగు వద్ద అదే గ్రామానికి చెందిన లోలుగు కాంతమ్మ అనే వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారం పుస్తెలతాడు మంగళవారం మాయమైంది. ఆమె బురిడికంచరాం రహదారిలో ఉన్న పొలా నికి వెళ్తుండగా అటువైపుగా వచ్చిన ఆటో డ్రైవర్ ఎక్కమని చెప్పడంతో ఆటో ఎక్కారు. ఆటో దిగేసరికి మెడలో తాడు కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. ఆటో ఎక్కిన సమయంలో లోపల గుర్తు తెలియని మహిళ ఉందని, ఆ మహిళే తాడును చోరీ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె కుమారుడు నూకరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


