ఆరోగ్యం..ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం..ఆదాయం

Mar 4 2026 7:16 AM | Updated on Mar 4 2026 7:16 AM

సేంద్రియ సేద్యం.. ఆరోగ్యం..ఆదాయం

ఆదర్శంగా నిలుస్తున్న పద్మాపురం

రైతు

నాలుగు ఎకరాలలో కూరగాయల సాగు

ఐదు ఎకరాలలో చిరు ధాన్యాలు

పది ఎకరాలలో పండ్ల తోటల పెంపకం

నేలతల్లిని కాపాడేందుకే..

సేంద్రియ సేద్యం..

సారవకోట : ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ, కలుషితమే. తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అన్నింటా అనారోగ్య కారకాలే. ఈ నేపథ్యంలో చాలామంది సేంద్రియ, ప్రకృతి విధానంలో తయారైన ఉత్పత్తుల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. కారణాలు ఏవైనా సేంద్రియ సాగు చేసే రైతులు మాత్రం మన జిల్లాలో చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తనకున్న భూమిలో మొత్తం సేంద్రియ విధానంలోనే వ్యవసాయం చేస్తూ మంచి ఆదాయం సాధించడంతో పాటు సమాజానికి ఆరోగ్యకర ఉత్పత్తులు అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు సారవకోట మండలం కేళవలస పంచాయతీ పద్మాపురం గ్రామానికి చెందిన రైతు రావాడ మోహనరావు. తనకున్న 23 ఎకరాల భూమిలో సేంద్రియ పద్ధతులతో కూరగాయలు, చిరు ధాన్యాలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. కిడిమి గ్రామానికి సమీపంలో కొండలకు ఆనుకుని ఉన్న తన స్థలాన్ని సాగు భూమిగా మార్చి సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో అటు నేలతల్లికి, మానవులు ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రహించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, అగ్ని హస్త్రంలను ఉపయోగించి సొరకాయలు, వంకాయలు, దొండ, బీర, సారికంద, మిరప, చిక్కుడు, బీన్స్‌, తోట కూర, క్యారెట్‌, ముల్లంగి తదితర పంటలను సాగు చేస్తున్నారు.

పాడి పెంపకం సైతం..

సేంద్రియ పద్ధతులైన ఘన, ద్రవ జీవాస్త్రాల తయారీకి నాటు ఆవులు అవసరం రావడంతో 50 నాటు ఆవులు, ఇతర జాతులకు చెందిన ఆవులు, కోళ్లను పెంచుతున్నారు. నాటు ఆవుల పేడ, మూత్రం వినియోగించి తయారు చేసిన ఎరువులతో పంటలను సాగు చేస్తున్నారు. మరోవైపు 60 సెంట్లలో ప్రత్యేకించి అంతర పంటలుగా ఒకే చోట ఏడు రకాల కూరగాయలు సొర కాయలు, దొండ, తోటకూర, క్యారెట్‌, కాకర, బీర, ముల్లంగి పంటలు పండిస్తున్నారు. ఇవేకాక కూరగాయలు పండిస్తున్న పంట పొలాల చుట్టు ఖాళీ ప్రదేశాలలో 600 కొబ్బరి మొక్కలు, మామిడి, సపోట, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి పంటలను పండిస్తూ వాటికి సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. తనకున్న ఖాళీగా ఉన్న భూమిలో 4 బోర్లు వేసి మూడింటికి సోలార్‌ పద్ధతిలో నడిచేలా మోటార్లు ఏర్పాటు చేసి స్ప్రింక్లింగ్‌ విధానంలో నీరు అందిస్తున్నారు. రసాయన ఎరువులు వాడకుండా చిరు ధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు పండిస్తున్నారు. ఇక్కడ పండించిన పంట సారవకోట, అలుదు గ్రామాలతో పాటు నరసన్నపేటలో విక్రయిస్తున్నారు. నాటు ఆవుల గెత్తాన్ని ఇతర ప్రాంతాలకు విక్రయానికి తరలిస్తున్నారు.

ప్రస్తుతం రసాయన ఎరువులు వాడకం ఎక్కువైంది. దీంతో నేలతల్లికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఆ నేల తల్లిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అటు నేలతల్లికి, ఇటు మానవాళి మనుగడకు సేంద్రియ సాగు ఎంతో అవసరం. ఆహార అలవాట్లు మారడం వల్ల మానవుడు తాను సంపాదిస్తున్న ఆదాయంలో సగం వరకు వైద్య ఖర్చులకు వెచ్చించాల్సి వస్తోంది.

– రావాడ మోహనరావు,

రైతు, పద్మాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement