రామ్మోహన్‌రావుకు రాష్ట్రస్థాయి అవార్డు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బగాది రామ్మోహన్‌రావు రాష్ట్ర వినియోగదారులు కమిటీ తరఫున అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. విజయవాడలో బుధవారం జరిగే కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
బాల్య వివాహం
సామాజిక శాపం
శ్రీకాకుళం పాతబస్టాండ్: బాల్య వివాహాలు సామాజిక శాపమని, వీటి వల్ల బాలికల భవిష్యత్ అంధకారమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నల్సా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం స్థానిక వరం మున్సిపల్ హైస్కూల్‌లో బాల్య వివాహాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు బాలికలకు రక్షణ కల్పించే వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని హరిబాబు పిలుపునిచ్చారు. చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య, న్యాయపరమైన చిక్కులను విద్యార్థినులు గుర్తించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది జి. ఇందిరా ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీకష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


