వికసిత్ భారత్ లక్ష్యసాధనకు కృషి
శ్రీకాకుళం పాతబస్టాండ్: పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటూ స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలుకావాలని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి ‘విబి–జీ రామ్ జీ’, వైద్యారోగ్యం, విద్య, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్ , పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ తదితర పథకాలపై ఆయా శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ 185 రోజులు కూలి దొరికేలా కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్ జీ పథకం తీసుకొచ్చిందన్నారు. బహుళ ప్రయోజనాల పీఎం సూర్యఘర్ పథకం అమల్లో మరింత చొరవ చూపాలన్నారు. వైద్య రంగంలో మార్పులు తీసుకువస్తున్నామని, మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. సమావేశంలో శాసన సభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత, సీపీఓ లక్ష్మీప్రసన్న, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు, డీసీహెచ్‌ఎస్ కళ్యాణ్ బాబు, డ్వామా పీడీ లవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి రవికుమార్, ఏపీఈపీడీసీఎల్, సమగ్ర శిక్ష అధికారులు పాల్గొన్నారు.


