విని వదిలేస్తున్నారా..?
● పోలీసుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తున్న రోడ్డు ప్రమాదాలు
● సమీక్షలు, సమావేశాల్లో వినినట్టే విని వదిలేస్తున్న అధికారులు
● హైవేల్లో ఎక్కడికక్కడే భారీ వాహనాల పార్కింగ్
శ్రీకాకుళం క్రైమ్ : ‘హైవేల్లో ఘోరంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడే భారీ వాహనాలు నిలిపేస్తున్నారు. టోల్‌ప్లాజాలు, ముఖ్య కేంద్రాల వద్ద షాపులు వెలియడంతో రోడ్లమీదే వాహనాలు బారులు తీరుతున్నాయి..’ శనివారం మధ్యాహ్నం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో విలేకరులు అన్న మాటలివి. ఆ మాటలు అన్న కొద్ది గంటలకే కోటబొమ్మాళి ఎత్తురాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టి నలుగురు చనిపోయారు. ఈ ఘటన జరగడానికి డ్రైవర్ నిద్రమత్తు ఎంత కారణమో, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయడం కూడా అంతే తప్పు అన్న వాదన వినిపిస్తోంది. నవంబరు నెలలో ఇప్పటికే జిల్లాలో 12 మంది మృత్యువాత పడ్డారు.
సూచిస్తున్నా..
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి నేర సమీక్ష సమావేశాల్లోను, రోజువారీ మాట్లాడే సెట్ కాన్ఫరెన్సుల్లో ఎన్నో సలహాలు ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, హైవే పెట్రోలింగ్ వాహనాలు తక్షణమే స్పందించి క్షణాల్లో ఘటనా స్థలికి చేరాలని, స్పీడ్, ర్యాష్, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్, మైనర్ రైడింగ్ చేస్తున్నవారి వాహనాలు ఆపాలని, అర్ధరాత్రి, వేకువజామున వాహన డ్రైవర్లకు ఫేష్‌వాష్ చేయించాలని, బ్లాక్‌స్పాట్లు గుర్తించాలని, హైవేపైన, కింద సర్వీస్ రోడ్లపైన, ఫ్లై ఓవర్ల కింద భారీ వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలని ఎంత మొత్తుకున్నా.. ఎవ్వరూ వినే పరిస్థితిలో లేనట్లే కనిపిస్తోంది. వరుసగా జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం.
అన్ని విభాగాలూ ‘మామూలే’..
ప్రమాదాలు నివారించడంలో అందరికంటే ముందు వరుసలో ఉండాల్సిన పోలీసులు వాహనాలను తనిఖీ చేసేది అంతంతమాత్రమే. అధికంగా కోటబొమ్మాళి, కంచిలి, ఇచ్ఛాపురం హైవేల్లో పోలీసుల తీరు వేరేగా ఉంది. ముఖ్య కూడళ్ల వద్ద షా పుల నుంచి దాబాల వరకు నెలవారీ మామూళ్లు చాలా మామూలు విషయమని అక్కడి వారే చెబుతున్నారు. హైవే అథారిటీ అధికారులు సైతం ఇబ్బడిముబ్బడిగా టోల్‌ప్లాజాలు వద్ద టీ, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్, ఇతర వ్యాపార దుకాణాలకు అనుమతులివ్వకుండానే వారు నడుపుకునేందుకు ‘ఒప్పందం’ చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. కమర్షియల్ ట్యాక్స్ సిబ్బంది సైతం రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.
ప్రమాదాలకు ఆస్కారమిలా..
ఎన్‌హెచ్–16 నుంచి సర్వీస్ రోడ్డులోకి ఎంటర్ అయ్యేటప్పుడు జిల్లాలో చాలా చోట్ల కాంక్రీట్ దిమ్మలు అడ్డంగా ఉంచడం.
సర్వీస్ రోడ్డు నుంచి హైవేకి వెళ్లేటప్పుడు అధిక వేగంతో వాహనాలు వెళ్లడం, ఒకే మార్గంలో ఎదురెదురుగా వాహనాలు రావడం.
వాహనదారుల మద్యం మత్తు, నిద్రమత్తు, రహదారి నిబంధనలు ఉల్లఘించడం.
ఇచ్ఛాపురం నుంచి పైడిభీమవరం వరకు లారీలు సర్వీసు రోడ్లలోనే కాక హైవేల మీద గంటల తరబడి పార్కింగ్ చేయడం, ఫ్లై ఓవర్ల కింద రోజుల తరబడి ఉంచేయడం.
హైవే వెంబడి రాత్రి పూట లైట్లు వెలగకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, హెచ్చరిక బోర్డులు అనుకున్న స్థాయిలో లేకపోవడం.
బ్లాక్‌స్పాట్‌లు గుర్తించేలా ఈ చోట ప్రమాదాలెక్కువ అంటూ సూచిక బోర్డులు లేకపోవడం.
ముఖ్యంగా పోలీసులతో పాటు రవా ణాశాఖాధికారులు వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్‌లా చేపట్టకపోవడం.


