దుండగుల దాడిలో యువకుడు మృతి..?
టెక్కలి రూరల్: టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి గోపినాథపురం గ్రామానికి చెందిన కొమనాపల్లి పద్మనాభం(36) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పద్మనాభం నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై దాడి చేయడంతో ఆ వ్యక్తిని టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రి సిబ్బంది పంపిన ఎంఎల్‌సీ రిపోర్ట్ కారణంగా పోలీసులు గాయపడిన వ్యక్తి నుంచి సమాచారం సేకరించి పద్మనాభంను పోలీసులు విచారించి అనంతరం విడిచిపెట్టారు. కాగా ఆదివారం రాత్రి గ్రామం వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పద్మనాభంని తీవ్రంగా గాయపరిచారని, దీంతో తీవ్రగాయాలకు గురైన ఆయనను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం. ఇదే విషయమై టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. పద్మనాభం తీవ్రగాయాలకు గురై మృతి చెందిన విషయం వాస్తవమేనని, అయితే ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి గతంలో ఐటీబీపీలో పనిచేసేవాడన్నారు. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో చాలామందితో గొడవలు పడేవాడని, ఆ కారణంగానే గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు.


