గుక్కెడు నీరు.. ఇప్పించలేరా సారూ
● జలుమూరు, సారవకోట వాసుల విజ్ఞప్తి
● నిర్వహణ లోపంతో తాగునీరు
అందించలేని వైనం
జలుమూరు: నిరంతరం గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం గుక్కెడు మంచినీళ్లు మాత్రం ఇవ్వలేకపోతోందని జలుమూరు, సారవకోట మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. సుమారు ఎనిమిదేళ్ల కిందట అచ్యుతాపురం వద్ద రూ.48 కోట్లతో జల్‌జీవన్ మిషన్ పథకంలో శ్రీముఖలింగం రక్షిత మంచినీటి పథకం ప్రారంభించారు. పథకం ప్రారంభంలో కొన్ని గ్రామాలకు కొంత వరకూ తాగునీరు అందించారు. కానీ కొద్ది రోజులుగా తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యా యి. జలుమూరు, సారవకోట మండలాల్లో సుమా రు 94 గ్రామాలకు రక్షిత మంచినీరు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
జలుమూరు మండలంలో చాలా వరకూ పంచాయతీలకు ట్యాంక్‌లు నిర్మాణం జరిగి ఆయా గ్రామాలకు పైపులైన్‌లు కూడా వేసి అనుసంధానం చేయలేదు. అలాగే సారవకోట మండలం పంచాయతీలకు పైపులైన్‌లు వేసి రోడ్డు మీద విడిచిపెట్టేశారని, దీంతో తాగునీరు వృధా అవుతోందని ఆయా గ్రామ ప్రజలు చెబుతున్నారు. కొన్ని చోట్ల ట్యాంక్, పైపులైన్ వేసి నిర్వహణ చేయకపోవడంతో నెలకు పది రోజులైనా నీరు రావడం లేదు. దీంతో ఆయా పంచాయతీ ప్రజాప్రతినిధులు గ్రామీణ నీటిసరఫరా అధికారులకు ఫిర్యాదు చేస్తే మరమ్మతులు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు.
నిర్వహణ లోపమే శాపం
గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పర్యవేక్షించాల్సిన ఏఈ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడంతో సారవకోట ఏఈని ఇన్‌చార్జిగా నియమించారు. ఆయన సమావేశాలకు హాజరవుతున్నారు తప్ప సమస్య పరిష్కరించలేకపోతున్నారు. అచ్చుతాపురం వద్ద ఉన్న ఈ రక్షిత పథకం ఆపరేటర్ కూడా ఒకరు లేకపోవడం, కింది స్థాయి సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో తూతూమంత్రంగా సేవలు అందిస్తున్నారు.
నెలకు పదిరోజులు కూడా నీరు రాదు
నెలకు పది రోజులు కూడా తాగునీరు ఇవ్వరు. ఉదయం అయితే చాలు తాగునీరు కోసం నానా అవస్థలు పడుతున్నాం.
– పంచిరెడ్డి పద్మ, మహిళ,లింగాలవలస
తాగునీరు అందిస్తాం
సిబ్బందితో పర్యవేక్షణ చేసి తాగునీరు అందించేందుకు కృషి చేస్తాం. ట్యాంక్‌లు అనుసంధానం చేసే చోట చర్యలు తీసుకుంటాం. పైపులు లీక్ అయిన వెంటనే మరమ్మతులు చేస్తున్నాం. సిబ్బంది కొరత అధిగమిస్తాం.
– జల్లు సుదర్శన్, డీఈఈ,
గ్రామీణ నీటి సరఫరా విభాగం
గుక్కెడు నీరు.. ఇప్పించలేరా సారూ


