అజాగ్రత్తగా ఉన్నారో..
● రణస్థలం పైవంతెన పనులతో వాహనాల మళ్లింపు
● జాగ్రత్తగా లేకుంటే ప్రాణాలకే ప్రమాదం
స్థానికులు సహకరించాలి
రణస్థలం టౌన్‌లో ఉన్న వ్యాపారులు, స్థానికులు పై–వంతెన పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. సర్వీస్ రోడ్డులో ప్రధాన వాహనాలు విడిచిపెట్టడం వల్ల ఆ రోడ్డుపై ఎవరూ వాహనాలు నిలుపరాదని సూచించారు. అలాగే సర్వీస్ రోడ్డులో అప సవ్య దిశలో వాహనాలు రావటం వలన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే పనులు వేగవంతం అవుతాయి.
– రాధాకృష్ణ, ఎస్‌ఈపీఎల్ ప్రాజెక్టు మేనేజర్
విద్యుత్ దీపాలు వేయాలి
రణస్థలం టౌన్‌లో పైవంతెన పనులు జరిగే ప్రదేశాల్లో విద్యుత్ దీపాలు, ట్రాఫిక్ మళ్లింపు వద్ద రేడియల్ స్టిక్కర్లతో కూడిన స్టాపర్ బోర్డు ఎక్కువగా పెట్టాల్సి ఉంది. అలాగే వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
– పిన్నింటి సత్యంనాయుడు, జేఆర్ పురం
రణస్థలం: జాతీయ రహదారుల సంస్థ–16 విస్తరణలో భాగంగా పెండింగ్‌లో ఉన్న రణస్థలం పై–వంతెన పనులు సాగుతున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ విశాఖపట్నం సారథ్యంలో ఎస్‌ఈపీఎల్ పనులు చేస్తోంది. బంటుపల్లి పరిధిలోని యూబీ పరిశ్రమ దిగువ నుంచి లావేరు మండలంలోని రావివలస దిగువ వరకు 4.2 కిలోమీటర్లు వంతెన నిర్మిస్తున్నారు. పైవంతెన నిర్మాణ పనులు జరిగే ప్రదేశంలో వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. అందువల్ల టౌన్ మధ్యలో 800 మీటర్ల పరిధిలో 25 సింగిల్ స్తంభాలు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు చేయాల్సి ఉన్నందున తహసీల్దార్ కూడలి నుంచి పాత పోలీస్ స్టేషన్ వరకు సర్వీస్ రోడ్డులోని వాహనాలను విడిచిపెట్టడానికి సన్నద్ధమయ్యారు. అయి తే సర్వీస్ రోడ్డులో ప్రధాన వాహనాలు విడిచిపెడితే సమస్య వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ రోడ్డులో ఉన్న వ్యాపారులు ఎరువులు, సిమెంట్, ఇతర సామగ్రి దించాలన్నా భారీ వాహనాలు నిలపడం కుదరదు. ఇలాంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోతుంది. అలాగే సర్వీస్ రోడ్డులో ఎదురెదురుగా వాహనాలు వచ్చేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
హెచ్చరిక బోర్డులు తప్పనిసరి
రణస్థలం టౌన్‌లో ట్రాఫిక్ మళ్లింపు వల్ల దూరం నుంచి వచ్చే వాహనాలకు అవగాహన తక్కువ. స్టాపర్ బోర్డులు, వేగ నియంత్రణ, దారి మళ్లింపు బోర్డులు పెట్టాల్సి ఉంది. అలాగే రాత్రి వేళల్లో ముఖ్య కూడలిలో దీపాలు అమర్చాలని స్థానికులు కోరుతున్నారు.
అజాగ్రత్తగా ఉన్నారో..


