
అమ్మవారి ఆలయాల్లో చోరీ
నందిగాం : నరేంద్రపురంలోని రెయ్యిబోడెమ్మ, భూలోకమాత అమ్మవారి ఆలయాల్లో సోమవారం రాత్రి పూజా సామగ్రి చోరీకి గురైంది. ఈ ఏడాది మార్చి 9న గ్రామ శివారులో గ్రామదేవతల ఆలయాలకు ప్రతిష్టాపన చేశారు. నిత్య పూజలకు అవసరమైన వెండి, ఇత్తడి సామాన్లు సమకూర్చుకున్నారు. సోమవారం సాయంత్రం పూజ కార్యక్రమాలు పూర్తయ్యాక తలుపులు వేసి గ్రామస్తులు వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం వచ్చి చూసే సరికి రెండు ఆలయాల్లో రెండు వెండి శఠగోపాలు, రెండు ఇత్తడి బిందెలు, నాలుగు ఇత్తడి పల్లేలు, నాలుగు దీపస్థంభాలు, రెండు గంటలు, రెండు పూలసజ్జలు చోరీకి గురయ్యాయి. హుండీలో ఉన్న డబ్బులు సైతం పట్టుకుపోయారు. గ్రామస్తులు నందిగాం పోలీసులకు సమాచారం తెలియజేయగా సిబ్బంది వచ్చి పరిశీలించారు.