
ఈసీ తీరు బాధాకరం
● కొవ్వొత్తులతో కాంగ్రెస్ నాయకుల ర్యాలీ
శ్రీకాకుళం అర్బన్: దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎలక్షన్ కమిషన్, కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుండడం బాధాకరమని, ప్రజాస్వామ్యాన్ని పాతరేసేలా పనిచేస్తున్న ఎన్నికల కమిషన్ తీరును దేశ పౌరులంతా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదం వెంకట త్రినాథరావు, అంబటి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా విజ్ఞాన్ భవన్ నుంచి మున్సిపల్ ఆఫీస్ గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ద్వారా పౌరులకు సంక్రమించిన ఓటుహక్కును కేంద్రంలో ఉన్న బీజేపీ దొంగలించి దొడ్డిదారిలో అధికారం చేపట్టడం శోచనీయమన్నారు.
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సైదుల్లాఖాన్, అంబటి లక్ష్మణరావు, తెంబూరు మధుసూదనరావు, అంబటి దాలినాయుడు, చాన్ భాష, మామిడి సత్యనారాయణ, ఆబోతుల వెంకట నాయుడు, బొచ్చ వెంకటరమణ, ఆదినారాయణ, బగ్గు రాము, సురియా బేగం తదితరులు పాల్గొన్నారు.