
దైవ కార్యక్రమానికి అడ్డంకులు
గార: తనకు ప్రాధాన్యం కల్పించడం లేదని ఏకంగా గ్రామ దేవత ప్రతిష్టాపన ఉత్సవాన్నే అడ్డుకున్నాడు ఓ టీడీపీ నాయకుడు. గార మండలం వాడాడ పంచాయతీ అచ్చెన్నపాలెంలో ఘటన జరిగింది. ఇక్కడ గాంధే అమ్మ(వేప చెట్టు) వద్ద కొన్నేళ్లుగా పూజలు జరుగుతున్నాయి. స్థానికుడు బంటుపిల్లి నాగేశ్వరరావు ఆలయాన్ని కొందరు దాతల సహకారంతో నిర్మించారు. అమ్మవారి ప్రతిష్ట జరపాలని తలచి గ్రామస్తుల్లో కొందరిని సంప్రదించి 17వ తేదీ ప్రతిష్టతో పాటు అన్నదానం చేయాలని నిర్ణయించారు. అయితే స్థానిక టీడీపీ నాయకుడు శిమ్మ శ్రీను తనకు సమాచారం ఇవ్వలేదనే నెపంతో కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి రాకపోయినా, ప్రతిష్టాపన కరపత్రాన్ని ఇచ్చేందుకు వెళ్లిన యువకుడి ని చెంపదెబ్బ కొట్టినా ఓర్చుకున్నామని తెలిపారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రతిష్టాపనను అడ్డుకునేందుకు ప్రయత్నించాడని, స్టేషన్‌కు రెండు సార్లు పిలిస్తే వెళ్లామని, అక్కడ పోలీసులు అధికార పార్టీ వ్యక్తులకే మద్దతు తెలపడంతో వచ్చేశామని గ్రామస్తులు తెలిపారు. శనివారం ఉద యం పోలీసులు గ్రామంలోకి వచ్చిన తర్వాత సమావేశం నిర్వహించే సమయంలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో కార్యక్రమాన్ని వాయిదా వేయాలని, ఇరు పక్షాలు సర్కిల్ కార్యాలయంలో సమావేశానికి రావాలని శ్రీకాకుళం సర్కిల్ సీఐ పైడపునాయుడు కోరారు. గ్రామంలో పోలీస్ పికెట్ నడుస్తోంది.
ఎస్పీకి ఫిర్యాదు
శనివారం సాయంత్రం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి అచ్చెన్నపాలెం గ్రామస్తులు, వీహెచ్‌పీ, భజరంగదళ్ సభ్యులు కలసి ఫిర్యాదు చేశారు. దైవ కార్యక్రమాలను నిలిపేయడం బాధాకరమని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.
అచ్చెన్నపాలేం గ్రామదేవత ప్రతిష్టాపన నిలిచిన వైనం
టీడీపీ నాయకుడి విపరీత ధోరణే కారణం