
భోజనాలకు అప్పులు.. నిర్వాహకులకు తిప్పలు
త్వరలోనే చెల్లిస్తాం..
కొత్తూరు: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు అందక వంట ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి విద్యార్థులకు భోజనాలు పెడుతున్నా బిల్లులు మంజూరు కావడం లేదని, కనీసం గౌరవ వేతనం సైతం అందడం లేదని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది జనవరి నుంచి జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని 30 మండలాల్లో 38 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో భోజన పథకం అమలు చేస్తున్నారు. విద్యార్థులకు వంట చేసి భోజనం పెట్టేందుకు 150 మంది మధ్యాహ్న భోజన కార్మికులను నియమించారు. వీరు సుమారు 12800 మంది విద్యార్థులకు భోజనాలు వండి పెడుతున్నారు. ఒక్కో విద్యార్థి భోజనానికి ప్రభుత్వంరూ.9.27 పైసలు చెల్లించాల్సి ఉంది. అదే విధంగా, నిర్వాహకులకు గౌరవ వేతనం కింద ఒక్కొక్కరికి నెలకు రూ.3వేలు చెల్లించాల్సి ఉంది. అయితే పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పు చేసి పప్పుకూడు..
బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించకపోవడంతో అప్పులు చేసి వండి పెట్టాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. కూరగాయలు, పప్పు, నూనె, కిరాణా సామగ్రితో పాటు వంట చెరుకులు నిత్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎప్పటికై నా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని ఆశతో అప్పులు చేస్తున్నామని, అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం సబబు కాదని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు ఆకాశాన్నంటుతుండటంతో వాటిని కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఎనిమిది నెలలుగా బిల్లులు చెల్లించక పోవడంతో అప్పులు చేసి వంటలు చేయాల్సి వస్తోంది. గౌరవ వేతనాలు కూడా ఇంతవరకు చెల్లించలేదు. అప్పులు చేసి కుటుంబాలను పోషిస్తున్నాం. ఇతర పనులకు వెళ్లలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.
– ఎ.సుందరమ్మ, వంట ఏజెన్సీ సభ్యురాలు, కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల
వంట ఏజెన్సీ సభ్యులుగా చేరడం వల్ల ఉపాధి పనులకు రానివ్వడం లేదు. వంట సభ్యులుగా చేరి ఎనిమిది నెలలు గడుస్తున్నా బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించడం లేదు. అప్పులు చేసి కుటుంబాలను పోషిస్తున్నాం. బిల్లులు ప్రభుత్వం చెల్లించిన వడ్డీలకు సరిపోయేలా లేవు.
– కె.కన్నెమ్మ, వంట ఏజెన్సీ సభ్యురాలు, కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు అందని బిల్లులు
గౌరవ వేతనాలు సైతం చెల్లించని పాలకులు
ఎనిమిది నెలలుగా తప్పని అవస్థలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బడ్జెట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరో వారం రోజుల్లో వంట ఏజెన్సీ సభ్యులకు బిల్లులతో పాటు గౌరవ వేతనాలు జమవుతాయి.
– పి.దుర్గారావు, ఆర్‌ఐఓ, శ్రీకాకుళం

భోజనాలకు అప్పులు.. నిర్వాహకులకు తిప్పలు

భోజనాలకు అప్పులు.. నిర్వాహకులకు తిప్పలు

భోజనాలకు అప్పులు.. నిర్వాహకులకు తిప్పలు