
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
● గోడకు రంధ్రం పెడుతుండగా గమనించిన స్థానికుడు ● పారిపోయిన దుండగులు ● శ్రీకూర్మంలో ఘటన
గార : శ్రీకూర్మం యూనియన్ బ్యాంకులో దోపిడి చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో బ్యాంకు గోడకు రంధ్రం పెట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పశ్చిమ వైపునున్న మేనేజర్ గది కిటికీపై సన్‌స్లేడ్ సమీపంలో మూడు ఇంచీల మేర రంధ్రం చేయడంతో పాటు పక్కనే ఉన్న ఇంటర్‌గ్రిల్ తొలగించేందు కు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో బ్యాంకుపైన నివసిస్తున్న ఓ వ్యక్తి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. కన్నం పెట్టేందుకు ఉపయోగించిన, సుత్తి, కత్తవ, సన్నిగొడ్డ (రాయి)ని అక్కడే వదిలేశారు. వెంటనే స్థానికులు బ్యాంకు సిబ్బందికి తెలియజేశారు. గురువారం ఉదయం బ్యాంకు మేనేజర్ చినరామయ్య గార పోలీసులకు సమాచా రం అందించారు. ఒకటో పట్టణ స్టేషన్ సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ గంగరాజు, సీసీటీఎస్ సిబ్బంది బ్యాంకు పరిసరాలను పరిశీలించారు. శ్రీకూర్మం గ్రామంలో రాత్రి 11 గంటల నుంచి 4 గంటల వర కు విద్యుత్ సరఫరా లేకపోవడం, ఆ సమయంలో దొంగతనానికి పాల్పడటం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీకూర్మం మెయిన్ రోడ్డులో ఉన్న ఈ బ్యాంకుపై ఆరు కుటుంబాలు నివసిస్తుండగా, ఎదురుగా కొన్ని కుటుంబాలున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంకు దోపిడీకి విఫలయత్నం