
మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు షరతులు
● అరకొర బస్సులతో ఇప్పటికే అవస్థలు
● కొత్తగా బస్సులు సమకూర్చని ప్రభుత్వం
● కొన్ని బస్సుల్లోనే ఉచిత ప్రయాణానికి అనుమతి
బస్సుల సంఖ్య పెంచాలి
జిల్లాలో ప్రయాణికులకు సరిపడా బస్సులు లేవు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రయాణం కోసం మహిళలు మరింత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని బస్సులకూ ఈ సౌకర్యం క ల్పించాలి. ఉచిత ప్రయాణం జిల్లాకు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేలా చూడాలి.
– ఉలాల భారతి దివ్య, వైఎస్సార్‌సీపీ మహిళా
విభాగం జిల్లా అధ్యక్షురాలు
ఆంక్షలు వద్దు
ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆంక్షలు లేని ఉచిత ప్రయాణం అమలు చేయాలి. కేవలం పల్లెవెలుగు బస్సులకు మాత్రమే ఉచిత ప్రయాణం కాకుండా అన్ని బస్సులకూ వర్తింపజేయాలి.
– గుంట జ్యోతి, శ్రీకాకుళం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
‘మీరు ఎక్కడకు కావాలంటే అక్కడకు ఆర్టీసీ బస్సులో వెళ్లండి.. ఎవరైనా టికెట్ అడిగితే చంద్రన్న చెప్పాడని చెప్పండి..’ అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు హామీలు గుప్పించారు. తీరా అమలు సమయానికి వచ్చాక సవాలక్ష ఆంక్షలు పెట్టి ఉచితానికి కూడా పరిమితులు విధించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి అమలు కానుంది. కానీ ఈ ప్రయాణాలకు షరతులు వర్తిస్తాయి. వైజాగ్ వెళ్దామనిశ్రీకాకుళంలో నాన్‌స్టాప్ ఎక్కితే కుదరదు.. కాస్త కుదురుగా కూర్చుందామని ఆల్ట్రా డీలక్స్ ఎక్కితే ఉచితం ఉండదు.. పోనీ అన్నవరం వరకు వెళ్దామని సూపర్ డీలక్స్‌లో కూర్చుంటే టికెట్ తీసుకోవాల్సిందే. కాస్త అటూ ఇటూగా పేరు మార్చిన ‘పల్లె వెలుగు’లకు మాత్రమే ఉచితం పరిమితం కానుంది.
మెలికలు...షరతులు
కూటమి ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ మాదిరిగానే దీనికి కూడా షరతలు పెట్టారు. ఆడవాళ్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా వెళ్లే అవకాశం కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు రకరకాల మెలికలు పెట్టి పిల్లి మొగ్గలు వేస్తున్నారు. జిల్లా వరకు నేరుగా ప్రయాణం చేయవచ్చని, అది కూడా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సాధారణ ఎక్స్‌ప్రెస్ సర్వీసులకే మాత్రమే అని ఆంక్షలు పెట్టారు. ఒకవేళ ఇతర ప్రాంతానికి వెళ్లాలంటే సరిహద్దులో దిగి, ఆ పక్క జిల్లా బస్సు డిపోకి వెళ్లి మళ్లీ పల్లె వెలుగు బస్సులే ఎక్కాలని మెలిక పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, విజయవాడ... ఇలా ఏ గుడికి అయినా, ఎంత దూరం అయినా వెళ్లి రావచ్చనుకుని మహిళలు భావించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారు.
ఇప్పటికే ఆర్టీసీ కష్టాలు..
జిల్లాకు సంబంధించి ప్రధానంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తారు. పైడి భీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారిపై ప్రయాణించే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. విద్యార్థులు పుట్‌బోర్డులపై వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు. తగిన సంఖ్యలో బస్సులు లేకపోవడంతో ప్రయాణ కష్టాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఉచితం కావడంతో దాదాపుగా మహిళలు బస్సుల కోసం ఎదురు చూడవచ్చు. ఉదయం 10లోపు, సాయంత్రం నాలుగు తర్వాత మహిళల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బస్సులు అరకొరగా ఉన్న నేపథ్యంలో సమస్యగా మారనుంది. జిల్లాలో లక్షా 30వేల కిలోమీటర్ల మేర బస్సులు ప్రయాణం చేస్తున్నాయి. లక్షకు పైబడి జనం ప్రయాణిస్తున్నారు. మహిళలు 40వేల వరకు ఉన్నట్టు అంచనా. ఉచిత బస్సు అమలు కావడంతో ఈ సంఖ్య 50వేల నుంచి 60వేలకు పెరిగే అవకాశం ఉంది. మహిళల సంఖ్యకు తగ్గ బస్సులు లేకపోవడం వల్ల మిగతా ప్రయాణికులకు ఇబ్బంది తప్పేలా లేదు.
సిబ్బంది కొరత
జిల్లాలో ఆర్టీసీ పరిధిలో సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఇటీవల కాలంలో జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద ఎత్తున పదవీ విరమణ పొందారు. దీంతో ఆయా డిపోల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్ని విభాగాల్లో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నప్పటికీ డ్రైవర్, కండక్టర్ పోస్టులలో మాత్రం ఖాళీలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడున్న ఉద్యోగుల్లో అధిక శాతం మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ఆన్‌కాల్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఉచిత ప్రయాణం అమలు చేస్తే దీని ప్రభావం ప్రయాణికులు, బస్సులపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
షరతులు వర్తిస్తాయి
– ఉచిత బస్సు ప్రయాణాలకు షరతులు– అరకొర బస్సులతో ఇప్పటికే అవస్థలు– కొత్తగా బస్సులు సమకూర్చని ప్రభుత్వం – కొన్ని బస్సుల్లోనే ఉచిత ప్రయాణానికి అనుమతి
అరకొర బస్సులు..
జిల్లాలో 324 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇవి ఎప్పుడు పనిచేస్తాయో తెలియని పరిస్థితి ఉంది. వర్కింగ్‌లో ఉన్న వాటిలో ప్రభుత్వం చెప్పిన షరతులతో 204 బస్సులు మాత్రమే వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. వీటిలో 30 వరకు డొక్కు బస్సులు ఉన్నాయి. ఈ లెక్కన అందుబాటులో ఉన్న బస్సుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఉచిత ప్రయాణం అంటే మరింత రద్దీ పెరిగి సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు షరతులు

మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు షరతులు

మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు షరతులు