
వడ్డీ వ్యాపారి అదృశ్యం
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా వడ్డీలకు డబ్బులిచ్చే వ్యాపారి, తిరిగి కొందరు వ్యక్తులకు బకాయి పడి ఆర్థిక ఇబ్బందులు భరించలేక అదృశ్యమైనట్లు రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు వెల్లడించారు. సీఐ చెప్పిన వివరాల్లోకి వెళ్తే.. లావేరు మండలానికి చెందిన వారణాసి చిరంజీవి (38)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. అప్పటికే చిరంజీవి ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తుండేవాడు. సంవత్సరం పాటు విధుల్లోకి వెళ్లినా ఆ తర్వాత సెలవులు ఎక్కువగా పెట్టేయడంతో కంపెనీ తొలగించేసింది. దీంతో శ్రీకాకుళం నగరంలోని పుణ్యపువీధిలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటూ కొంత మొత్తాన్ని వడ్డీలకు తిప్పుతూ మొదట్లో బాగానే సంపాదించాడు. ఇదిలా ఉండగా ఈనెల 12వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో భార్య జయశ్రీకి బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటినుంచి చిరంజీవి వెళ్లిపోయాడు. అయితే భార్య తన భర్తకు పలుమార్లు ఫోన్లు చేసినా ఎత్తకపోవడం, అనంతరం భర్త ఫోన్ ఇంట్లోనే దొరకడంతో ఆందోళనకు గురయ్యింది. అతడి ఫోన్ చెక్ చేయగా ఇతరుల నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉండడం, అవే నంబర్లు నుంచి డబ్బులు ఎప్పుడిస్తావంటూ మెసేజ్‌లు ఉండడంతో బంధువుల వద్ద వాకబు చేసింది. అయినా అతని జాడ తెలియకపోవడంతో బుధవారం ఫిర్యాదు చేసిందని సీఐ తెలియజేశారు.