
అవినీతి అనకొండలు
పొందూరులో పైడికొండ దుస్థితి ఇది. కూట మి ప్రభుత్వం వచ్చాక జరిపిన తవ్వకాలతో ఎలా అయిపోయిందో చూడండి. అక్రమార్కులకు దోపిడీ కొండగా మారిపోయింది. రాత్రి పగలు తేడా లేకుండా ఎర్ర మట్టి, గ్రావెల్ తరలించుకునిపోతున్నారు. పక్కనున్న కాలనీలు ఏమైపోయినా ఫర్వాలేదు...మా జేబులు నిండితే చాలు అని రెచ్చిపోతున్నారు.
● కొండలకు గుండు కొడుతున్నారు
● కూటమి ప్రభుత్వం వచ్చాక రెచ్చిపోయిన గ్రావెల్ మాఫియా
● అధికారం అడ్డం పెట్టుకుని దర్జాగా తవ్వకాలు
● సొమ్ము చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
● కరిగిపోతున్న కొండలు
ఈ కొండ చూడండి.పలాస–కాశీబుగ్గలో ఉన్న సూదికొండ పరిస్థితి. కొండ దాదాపు కనుమరుగై శిఖరమే మిగిలి ఉంది. అధికార యంత్రాంగం మరికొంత కాలం చోద్యం చూస్తే ఆ శిఖరం కూడా పూర్తిగా కనుమరుగు కానుంది. పొక్లెయినర్లతో తవ్వి పట్ట పగలే గ్రావెల్, కంకర తరలించుకుపోతున్నారు.
రణస్థలం మండలం సంచాం కొండ ఇది. కొండ చుట్టూ గొరికేశారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా తన కళాశాల ముందు ఉన్న ప్రాంగణం చదును చేసేందుకు ఈ కొండను పూర్తిగా వాడుకున్నారు. ఇక్కడ తవ్వకాలు జరిపి తన కళాశాల లోతట్టు ప్రాంగణాన్ని సరిచేసుకున్నారు. ఆ ఎమ్మెల్యే బాటలోనే మిగతా తమ్ముళ్లు తవ్వకాలు జరుపుకుని సొమ్ము చేసుకుంటున్నారు.
కొండ ములగాం పంచాయతీలోని ముక్తుంపురం కొండ ఇది. దర్జాగా తవ్వుకుని తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఒకవైపు మింగేశారు. మిగతాది కూడా తవ్వేసే పనిలో ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కూటమి నాయకుల దెబ్బకు కొండలు కరిగిపోతున్నాయి. రణస్థలం మండలంలోని అక్కయ్యపాలెం కొండ, లావేరు మండలంలోని సూర్యనారాయణపురంలో గల తామరకొండ, పలాస, కాశీబుగ్గలోని నెమలి కొండ, కోటబొమ్మాళికి ఆనుకుని కొత్తపేట కొండ.. ఇలా ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు ఏ కొండనూ తెలుగు తమ్ముళ్లు వదలటం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొండలపై వాలిపోయారు. అధికారం అడ్డం పెట్టుకుని ఎక్కడికక్కడ కొండలను చెరబట్టారు. జిల్లాలో ఎటు చూసినా కొండలు, గుట్టలకు గుండు కొట్టే కార్యక్రమం కొనసాగుతోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పర్యావరణానికి హాని తలపెడుతూ.. మరో వైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. తమ జేబులు నింపుకుని ప్రకృతి మాతకు మానని గాయాలు మిగుల్చుతున్నారు. భావితరాలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ప్రకృతి పరిరక్షణలో కొండలూ కీలకం. ఇప్పుడా కొండల్నే కూటమి పాలనలో లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజలకు చెందాల్సిన సహజ వనరులను కొందరు నిరంతరాయంగా నమిలి మింగేస్తున్నారు. వీరి ధాటికి సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టి అక్రమార్కులు దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది.
జిల్లాలో గ్రావెల్ మాఫియా బరి తెగించింది. సహజ వనరులను ధ్వంసం చేస్తోంది. తమకెవరూ అడ్డు రారనే చందంగా వ్యవహరిస్తోంది. దీంతో కంకర రాశులతో ఉండే కొండలు కరిగిపోతున్నాయి. వందలాది టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ తవ్వి తరలిస్తుండటంతో కొండలు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

అవినీతి అనకొండలు

అవినీతి అనకొండలు

అవినీతి అనకొండలు

అవినీతి అనకొండలు