
అమానుషం!
● షాపులో పనిచేస్తున్న యువకుడిపై దాడికి పాల్పడిన యజమాని
● చికిత్స పొందుతూ యువకుడు మృతి
● ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
శ్రీకాకుళం క్రైమ్ : తన వద్ద పనిచేసిన యువకుడిని మద్యం మత్తులో మరో వ్యక్తితో కలసి దాడికి పాల్పడ్డాడో యజమాని. లెక్కల్లో తేడా వచ్చిందని కొట్టి ఇంటి ముందు పడేసి నిర్లక్ష్యంగా ఇద్దరూ వెళ్లిపోయారు. ఈ నెల 3వ తేదీ రాత్రి జిల్లా కేంద్రంలోని పొట్టిశ్రీరాములు మార్కెట్లో బాధితుడు ఉల్లాకుల రాజేష్ (32)పై జరిగిన ఈ దాడి ఘటన అప్పట్లో బయటకు పొక్కకుపోయినా కేజీహెచ్‌లో యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందడంతో వెలుగులోకి వచ్చింది. ఒకటో పట్టణ పోలీసులు హత్యకేసుగా నిర్ధారించి దాడికి పాల్పడిన యజమాని చీకటి వంశీ, సహకరించిన పుక్కళ్ల రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ హరికృష్ణ, బాధిత కు టుంబీకులు, స్థానికు లు తెలిపిన వివరాల మేరకు..
అరసవల్లికి చెందిన ఉల్లాకుల రాజేష్ కొంతకాలంగా పొట్టి శ్రీరాములు మార్కెట్లో చీకటి వంశీ నిర్వహిస్తున్న పండ్ల దుకాణంలో రోజువారీ కూ లీకి పనిచేస్తున్నాడు. ఎప్పట్లాగే ఈ నెల 3న రాజేష్ దుకాణం తెరిచి వ్యాపారం చేశాడు. అదే రోజు రాత్రి మద్యం పూటుగా సేవించి వచ్చిన యజమాని వంశీ ఎంత వ్యాపా రం జరిగిందని రాజేష్‌ను ప్రశ్నించడంతో రూ.24 వేలుగా లెక్క చూపించాడు. ఆదివారం కావడంతో పెద్దగా వ్యాపారం జరగలేదని చెప్పిడబ్బులు అప్పగించి ఇంటికి వెళ్లిపోయేందుకు రాజేష్ ప్రయత్నించాడు. దీంతో కోపోద్రిక్తుడైన వంశీ ఒక్కసారిగా రాజేష్‌పై దాడికి పాల్పడ్డాడు. అతికష్టమ్మీద అక్క డి నుంచి రాజేష్ పారిపోయాడు. అనంతరం వంశీ నగరానికి చెందిన మిత్రుడు పుక్కళ్ల రామకృష్ణను రప్పించాడు. తర్వాత రాజేష్‌కు పలుమార్లు ఫోన్‌చేసి కౌంటర్‌లో మాయం చేసిన డబ్బులు తిరిగివ్వకపోతే చంపేస్తామంటూ దుర్భాషలాడుతూ బెదిరించాడు. అనంతరం అరసవల్లి జంక్షన్‌లో రా జేష్ ఉన్నాడని తెలుసుకుని రామకృష్ణ ద్వారా మా ర్కెట్టుకు రప్పించాడు. ముఖం, తలపై పిడిగుద్దుల వర్షం కురిపించి రోడ్డుపైకి నెట్టేశారు. తీవ్ర గా యాలపాలైన రాజేష్‌ను అర్ధరాత్రి 12:30 గంటలకు అతని ఇంటిముందు పడేసి వెళ్లిపోయారు. తెల్లవారుజామున భార్య ధరణి తన భర్త అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి రిమ్స్‌కు తరలించింది. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌లో చేర్పించగా అక్కడ మంగళవారం మృతిచెందాడు. కాగా, దాడి జరిగి దాదాపు పదిరోజులు కావస్తు న్నా పోలీసులు విషయాన్ని బయటకు పొక్కనీయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.