
డిగ్రీ అధ్యాపకుల నిరసన
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బందికి వెంటనే బదిలీలను చేపట్టాలని జీసీజీటీఏ, జీసీటీఏ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సింగూరు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రోణంకి రవిశంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నాలుగో రోజు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలియజేశారు. బదిలీలతో పాటుగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పేరు మార్పు, జీఓ నంబర్ 42 రద్దుపై ప్రభుత్వం స్పందించాలని నినదించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
సదరం పత్రాల వివాదంపై దర్యాప్తు
నరసన్నపేట: నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో ఆర్థో స్పెషలిస్టుగా పనిచేసిన రవికిరణ్ జారీ చేసిన సదరం సర్టిఫికెట్ల వ్యవహారంపై సీఐ శ్రీనివాసరావు తన కార్యాలయంలో మంగళవారం విచారణ నిర్వహించారు. సర్టిఫికెట్లపై కౌంటర్ సంతకాలు చేసిన ముగ్గురు వైద్యుల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. పలువురికి వికలాంగత్వం లేకపోయినా ఉన్న ట్లు డాక్టర్ రవికిరణ్ సదరం పత్రాలు జారీ చేయడంపై ఎస్పీ ఆదేశాల మేరకు నరసన్న పేట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డీసీహెచ్‌గా పనిచేసి ప్రస్తుతం రాజాం సివిల్ సర్జన్ స్పెషలిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మిని విచారించారు. మంగళవారం డాక్టర్ జయశ్రీ, డాక్టర్ నాగమల్లేశ్వరి, డాక్టర్ నవీన్‌లతో మాట్లాడి వివరాలు సేకరించారు.

డిగ్రీ అధ్యాపకుల నిరసన